కాకినాడ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న సైకిల్... 32స్థానాలతో భారీ మెజార్టీ

SMTV Desk 2017-09-01 11:55:44  TDP, YSRCP, BJP, Kakinada Corporation, AP Chief Minister,

కాకినాడ, సెప్టెంబర్ 1: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. తెదేపా ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 48డివిజన్లకు పోలింగ్ జరగగా అధికార పక్షమైన టీడీపీ 32డివిజన్లు, భాజపా 3డివిజన్లు, వైసీపీ 10డివిజన్లు, స్వతంత్రులు 3డివిజన్లలో విజయం సాధించారు. కాగా, మిత్రపక్షం భాజపా గెలిచిన డివిజన్లతో కలిపి తెదేపా 35స్థానాల్లో భారీ మెజార్టీ కైవసం చేసుకుంది. కాగా, 17 డివిజన్లలో బరిలో నిలిచిన కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. గత కొన్ని సంవత్సరాల తరువాత కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ఈ ఫలితాలపై మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, గెలుపునకు కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. కాకినాడ ఫలితాలు తనకి సంతృప్తినిచ్చిందని, ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేద్దామని ఆయన అన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, తెదేపా ప్రజల వెన్నంటే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, కళా వెంకట్రావులు పాల్గొన్నారు.