సీతాఫలం లాభాలు తెలుసా ..

SMTV Desk 2019-10-23 16:14:27  

1.సీతాఫలం తింటే అలసట మటు మాయం! – ఆరోగ్య వార్తలు
శీతాకాలంలో విరివిగా దొరికే పండ్లలో సీతాఫలం ఒకటి. రుచిలో అనాస, అరిటిపండును పోలి ఉండే ఈ పండు పోషకాల రారాజు. సహజ చక్కెరలతో నిండిన ఈ ఫలం చర్మ, కురుల సోయగాన్ని పెంచుతుంది. ఈ సీజన్‌లో ప్రతిరోజు ఒక సీతాఫలం తింటే అలసట తగ్గిపోతుంది.దీనిలో పీచుపదార్థం ఎక్కువ. ఇది రక్తంలోకి చక్కెర విడుదలను ఆలస్యం చేసి టైప్‌-2 డయాబెటీస్‌ రాకుండా చూస్తుంది.ఈ పండు తింటే శరీరంలో నీటి నిల్వలు పెరుగుతాయి. అలసట తగ్గిపోతుంది.సీతాఫలంలోని విటమిన్‌ సి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రీరాడికల్స్‌ను తొలగించి చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.ఇందులోని కాపర్‌ కడుపు ఉబ్బరం, డయేరియా, జిగట విరేచనాలను తగ్గిస్తుంది.సీతాఫలం ఆకుల కషాయాన్ని గాయాల మీద రుద్దితే త్వరగా మానిపోతాయి.ఈ పండులో కార్బోహైడ్రేట్స్‌, పొటాషియం, ఫైబర్‌, విటమిన్లు, లవణాలు పుష్కలం. కొలెస్ట్రాల్‌ తక్కువ. సోడియం కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది.డోపమైన్‌, సెరటోనిన్‌ వంటి న్యూరోట్రాన్స్‌మీటర్ల ఉత్పత్తికి అవసరమైన విటమిన్‌ బి6 సీతాఫలంలో సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్‌ బి6 ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, ఆస్తమాను నివారిస్తుంది.ఈ పండు తింటే చర్మం మీద ముడతలు, గీతలు, తగ్గిపోతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.దీనిలోని విటమిన్‌ ఎ కళ్లు, వెంట్రుకలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండు గుజ్జును సెగగడ్డల మీద రాస్తే ఫలితం ఉంటుంది.దీనిలోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కేన్సర్‌, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. సీతాఫలంలోని మెగ్నీషియం, పొటాషియం రక్తపీడనాన్ని అదుపులో ఉంచుతాయి. హృదయ కండరాలను రిలాక్స్‌ చేస్తాయి.సీతాఫలం గుజ్జుతో తేనె కలుపుకొని ప్రతిరోజు తింటే కావాల్సిన క్యాలరీలు అందడమే కాదు బరువు కూడా పెరుగుతారు.గర్భిణులు సీతాఫలం తింటే పుట్టబోయే బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతాయి. పురిటి నొప్పులు కొంత వరకూ తగ్గుతాయి.దీనిలోని సూక్ష్మపోషకాలు చర్మాన్ని సున్నితంగా మారుస్తాయి. లిక్విడ్‌ ఫౌండేషన్‌ కన్నా మెరుగ్గా పనిచేస్తాయి.ఈ పండు తింటే రక్తహీనత సమస్య ఉండదు. దీనిలోని ఐరన్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ నిల్వలను పెంచుతుంది.
2.ఆయుర్వేద వైద్యం ఆరోగ్య భాగ్యం
కీళ్ల నొప్పులు, మధుమేహం, స్థూలకాయం… జీవనశైలి రుగ్మతలను ముందుగానే కనిపెట్టే వెసులుబాటు ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో ఉంది. ముందస్తు పరీక్షలతో రుగ్మతలను పసిగట్టి వాటిని నియంత్రించుకుంటే, ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది.జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలనీ, నిరంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ ఎవరికి మాత్రం ఉండదు? అయితే, చాలా మంది ఏదైనా జబ్బున పడినప్పుడు గానీ, తమ శరీర స్థితిగతుల్ని పట్టించుకోరు. నిజానికి జబ్బు పడిన తర్వాత ఆస్పత్రుల చుట్టూ చక్కర్లు కొట్టే కంటే, ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడితే మేలు కదా! ఆరోగ్య పరిరక్షణ కోసం అయ్యే ఖర్చుతో పోలిస్తే, అనారోగ్యానికి పెట్టే ఖర్చు 100 రెట్లు అధికంగా ఉంటోంది. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే, అప్పుడప్పుడు కొన్ని వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించుకోవడం ఎంతో శ్రేయస్కరం.అయితే వ్యాపార దృష్టితో నడిచే కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య చికిత్సలకు రుసుము మరీ ఎక్కువ. ఆ ఖర్చులకు భయపడి ఎంతో మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇందుకు విరుగుడుగా హైదరాబాద్ (నిమ్స్)లో ఇటీవల ‘ఇంటెగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ ఒకటి ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని ‘నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ‘నిమ్స్’లో ‘ఇంటెగ్రేటెడ్ వెల్నెస్ కేంద్రం’ ఆరోగ్య పరిరక్షణకు తొలి ప్రాధాన్యమిస్తుంది.
**నరాల జబ్బులకు…
మన శరీరం మాంసం, సిరలు, స్నాయువులు, అస్థులు, సంధులు అనే వాటితో నిర్మితమై ఉంటుంది. వీటి మధ్య పరస్పర సంబంధం ఉండేలా చేసేవి మర్మాలు. ఈ మర్మాలు 107. మొత్తం నరాల వ్యవస్థ అంతా ఈ మర్మాలతోనే అసుసంధానం అయి ఉంటుంది. ఈ మర్మాలకు ఏదైనా హాని జరిగినప్పుడు, వాటి మధ్య ఉండే పరస్పర సంబంధం తెగిపోతుంది. ఈ పరిణామంతో ప్రధానంగా సయాటికా, లంబార్ స్పాండిలోసి్సతో పాటు పలు రకాల నరాల జబ్బులు మొదలవుతాయి.
**పరిష్కారం
నరాల జబ్బులకు ఆయుర్వేదంలోని మర్మ(మర్దన) చికిత్సలు ఎంతగానో తోడ్పడతాయి. కొన్ని రకాల గాయాల తాలూకు సమస్యలు ఎంతకూ తగ్గకుండా చాలా కాలం కొనసాగుతుంటాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిని మర్మ చికిత్స సమూలంగా తగ్గిస్తుంది. వ్యాయామం, శరీర శ్రమ లేకపోవడం వల్ల అవయవాలు శక్తిహీనంగా మారుతున్నాయి. అలాంటి వారికి మర్మ చికిత్సలు కొత్త శక్తిని నింపి, మొత్తం శరీర వ్యవ స్థను ఉత్తేజితం చేస్తాయి.
**అజీర్తి వ్యాధులకు…
ఆయర్వేదం ఆకలిని జీవాగ్నిగా భావిస్తుంది. జఠరాగ్ని, ధాత్వగ్ని, పంచభూతాగ్ని లేదా సూక్ష్మాగ్ని అంటూ మూడు రకాలుగా విభజిస్తుంది. అయితే జఠరాగ్ని కేంద్రంగా ఉంటూ మిగతా రెండు అగ్నులను ప్రభావితం చేస్తూ ఉంటుంది. జఠరాగ్ని సరిగా పనిచేసినప్పుడే తిన్న ఆహారం సంపూర్తిగా జీర్ణమై అందులోని సారం శరీర ధాతువులన్నింటికీ చేరుతుంది. ఏ కారణంగానైనా ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కానప్పుడు వ్యర్థ విషపదార్థాలతో కూడిన ‘ఆమం’ తయారవుతుంది. దీనివల్ల జీవక్రియలన్నీ కుంటుపడి, శరీర అవయవాలన్నీ శక్తిహీనమవుతాయి. ఫలితంగా శరీరం పలురకాల వ్యాధులకు గురవుతుంది.
*పరిష్కారం
శరీరంలోని ఆమాన్ని తొలగించే పంచకర్మ చికిత్సలు అవసరమవుతాయి. అందులో భాగంగా, దోషహర చికిత్సలైన వమనం, విరేచనం, వస్తి, నస్య రక్తమోక్షణ అనే పంచకర్మ చికిత్సలు చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆకలి పెరిగి జీవక్రియలన్నీ చక్కబడతాయి ఇదే సమయంలో దీపన పాచనతో పాటు, పిఛావస్తి చికిత్సలు కూడా ఇస్తే, పేగుల్లోని వాపులు తగ్గిపోయి ఐ.బి.ఎ్స(ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్) వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
**కీళ్ల నొప్పులకు…
సంధివాతంగా పేర్కొనే కీళ్ల నొప్పులకు, వాతం ప్రకోపం చెంది, కీళ్లలో చేరిపోవడమే కారణం. దీనికి వాతకారకమైన ఆహార పానీయాలతో పాటు, జీవన శైలి లోపాలు కూడా కారణమే! సంధివాతానికి పంచకర్మ చికిత్సలు, శమన చికిత్సలు అనే రెండు రకాల వైద్యాలు ఉంటాయి. వీటిలో భాగంగా కొన్ని ఉప చికిత్సలు కూడా ఉంటాయి.
*పరిష్కారం
కీళ్లనొప్పులకు కారణమైన దోషాలను, తొలగించడానికి ప్రధానంగా వస్తి చికిత్స ఉంటుంది. ఇక శమన చికిత్సలో భాగంగా బాహ్య చికిత్స, అభ్యంతర చికిత్సలు అంటూ రెండు రకాలుగా ఉంటాయి. బాహ్య చికిత్సలో భాగంగా స్నేహ, ఆలేపం, పరిశేకం వంటి చికిత్సలు ఉంటాయి. అభ్యంతర చికిత్సలో అరుగుదలకు గురైన కీళ్ల పైన, ఔషధీయ తైలాలతో మర్దనం చేయడం ఉంటుంది. ఇవన్నీ కీళ్ల నొప్పులను సమూలంగా తొలగిస్తాయి.
**మోకాళ్లనొప్పులకు
కీళ్లు అరగడం, వాతం కారణంగా మోకాళ్లనొప్పులు తలెత్తవచ్చు. యుక్తవయస్కుల్లో తలెత్తే మోకాళ్లనొప్పులకు పలు కారణాలు ఉంటాయి.
*పరిష్కారం
మోకాళ్ల నొప్పులకు జానువస్తి, గ్రీవవస్తి, వెన్నునొప్పికి కటివస్తి, ఉదర సంబంధ వ్యాధులకు పిఛావస్తి వంటి చికిత్సలు తోడ్పడతాయి. మోకాళ్ల నొప్పులకు నడక సరిగా లేకపోవడమూ కారణమే! దీనివల్ల కటి భాగం దెబ్బ తిని వెన్నునొప్పి కూడా మొదలవుతుంది. నడక, కూర్చోవడం వంటి భంగిమలను సరిచేయడం ద్వారా మోకాళ్ల నొప్పులతో పాటు స్పాండిలోసిస్ సమస్యలు కూడా తొలగించవచ్చు.
**మధుమేహానికి…
షుగర్ నిల్వలు పెరిగిపోవడం అనేది శరీరంలో మలినాలు బాగా పేరుకుపోయాయని తెలియచెప్పే ఒక సంకేతం. ఈ స్థితిలో పేగులు, కాలేయం, క్లోమగ్రంథి బలహీనపడతాయి. మధుమేహానికి చికిత్స చేయడం అంటే ఆ అవయవాలను తిరిగి బలోపేతం చేయడమే! అందుకు ఆయా భాగాల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపడమే పరిష్కారం.
*పరిష్కారం
వమన చికిత్స ద్వారా వ్యర్థాలను బయటకు పంపడం సాధ్యపడుతుంది. ఔషధీయమైన నెయ్యిని కడుపులోకి పంపించడం ద్వారా ఆ మలినాలను బయటికు పంపించాల్సి ఉంటుంది. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే శరీరంలోని మలినాలన్నీ బయటకు వస్తాయి. ఫలితంగా కాలేయం, క్లోమగ్రంథితో పాటు నాడీ వ్యవ స్థ అంతా చక్కబడుతుంది. క్రమానుగతంగా మధుమేహం నుంచి విముక్తి పొందే అవకాశం లభిస్తుంది. దీనికితోడు ప్రకృతి వైద్యంగా కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి. వీటి వల్ల హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథులు ఉత్తేజితమవుతాయి. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం కూడా ఇందులోభాగంగా ఉంటాయి. ఇవన్నీ మధుమేహాన్ని తగ్గిస్తాయి.
**స్థూలకాయానికి….
ఆహారంలోని పోషకాలు కణజాలానికి సరిగా అందకపోవడంతో అవి కొవ్వుగా మారడమే ఇక్కడ సమస్య. ఏవి తినాలో ఏవి తినకూడదో ఒక స్పష్టత లేక పోవడం కూడా సమస్యే!
3.ఎసిడిటీని నివారించే యోగాసనం
ఛాతీలో మంట, పుల్లని త్రేన్పులు, గొంతులోకి తన్నుకొచ్చే ఆమ్లం… ఎసిడిటీ ప్రధాన లక్షణాలు ఇవి. ఆ మంటను తగ్గించుకోవడం కోసం చల్లని నీళ్లు తాగుతాం, పెరుగు తింటాం. వీలైన చిట్కాలన్నీ ప్రయోగిస్తాం! కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడమే తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేవు.ఎసిడిటీ ఇబ్బందులకు ఫుల్స్టాప్ పెట్టాలంటే ఇదిగో ఈ యోగాసనం సాధన మార్జారియాసనంవెన్ను, పొత్తికడుపు మీద ప్రభావం చూపించే ఆసనమిది. జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణను పెంచి, జీర్ణసంబంధ అవయవాలకు ఈ ఆసనంతో వ్యాయామం దక్కుతుంది. సున్నితమైన మర్దన జరిగి జీర్ణవ్యవస్థ క్రమబద్ధమై, ఎసిడిటీ నుంచి విముక్తి లభిస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే…..చేతులు, మోకాళ్ల మీద బల్ల ఆకారంలో నేల మీద కూర్చోవాలి.ఈ భంగిమలో మోకాళ్లు అరడుగు దూరంలో, చేతులు నిటారుగా నేల మీద ఆనించి ఉంచాలి.ఊపిరి పీల్చుతూ, తలను నెమ్మదిగా పైకి లేపి వెనక్కి వాల్చాలి.ఇలా చేస్తూ వీపును పైకి లేపి విల్లు ఆకారంలో వంగాలి.ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉండి, నెమ్మదిగా వెన్ను వంచుతూ, ఊపిరి వదులుతూ పూర్వ స్థితికి రావాలి.
4.గురక తగ్గించే యాలకులు
సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ప్రధానమైనవి.. ఇవి ఆరోగ్యానికే గాక అందానికి, ఆనందానికి, రుచికి.. ఇలా ఎన్నో రకాలుగా తోడ్పడుతాయి.
– ప్రతిరోజూ యాలక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్‌తో అవసరం ఉండదు. ఈ మధ్య కాలంలో బరువు తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సింపుల్‌గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలక్కాయను తిని, ఒక గ్లాస్‌ వేడి నీళ్ళు తాగాలి. దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.- ఇంకా చెప్పాలంటే..నిత్యం ఒక యాలక్కాయను తినడం వల్ల శరీరంలోని హానికరమైన మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అన్ని అవయవాలను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది.
– మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు జీర్ణం కాక ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా అనేక మంది మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఈ నియమాలను ఫాలో అవ్వడం వల్ల మలబద్దకం సమస్య నుండి విముక్తి అవుతారు. తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది.- యాలక్కాయను ప్రతిరోజూ తినడం వల్ల నిద్రలేమీ సమస్య తొలగిపోతుంది. అలాగే నిద్రలో గురక తగ్గుతుంది. యాలకులు ఎముకలను బలంగా మార్చుతాయి. అంతేకాదు ఇవి చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్స్‌ బారినపడకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడుతాయి.