హైదరాబాద్ హోటళ్లల్లో కుళ్లిన మాంసంతో కబాబ్‌లు

SMTV Desk 2019-10-23 16:10:58  

పుట్టిన రోజంటే హోటల్‌కి.. పెళ్లి రోజంటే హోటల్‌కి.. నలుగురు కలిస్తే రెస్టారెంట్‌వైపే అడుగులు. ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే వేడి వేడిగా వడ్డించేస్తుంటారు. వాళ్లేంపెడుతున్నారో, మనం ఏం తింటున్నామో అని ఆలోచించం. జీరో బల్బు వెలుగుల్లో కబుర్లతో కాలక్షేపం చేస్తూ వడ్డించిన వన్నీ లాగించేస్తుంటాం. ఎప్పుడు చేశారో ఎలా చేస్తున్నారో.. అడిగే టైమూ అవసరమూ రాదు. ఇదే అవకాశంగా తీసుకున్న హోటల్ యాజమాన్యాలు.. రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచిన మటన్, చికెన్‌లను వండి వడ్డించేస్తున్నారు. కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. మురిగిన మాంసానికి మంచి ఘుమఘుమలాడే మసాలా దట్టించి, బాగా వేయించి వేడి వేడిగా కబాబులు, టిక్కాలు అంటూ రకారకాల పేర్లతో అందిస్తున్నారు.**నగరంలో ప్రముఖంగా చెప్పుకుంటున్న హోటళ్లు మినహా మిగిలిన హోటల్స్ అన్నీ దాదాపు ఇదే తంతు. ఇవన్నీ తెలిసినా జీహెచ్‌ఎంసీ మిన్నకుండి పోతుంది. అదేమని అడిగితే.. కోటి మంది నివసిస్తున్న ప్రాంతంలో ఒక్క ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కూడా లేరని చేతులెత్తేస్తున్నారు. ఏడాదికి ఒక సారి తనిఖీల పేరుతో హడావిడి చేసి జరిమానాలు విధిస్తుంటారు. అధికారులు వెళ్లి పోయిన తరువాత మళ్లీ యధామామూలే. హోటళ్ల పరిశుభ్రత, అగ్నిమాపక చర్యలు, మురుగునీటి వసతి, వ్యర్థాల నిర్వహణ వంటి విషయాలపై రోజుకి 20 నుంచి 30 ఫిర్యాదులు వస్తుంటే.. రెండు మూడు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడానికి మాత్రమే సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. వంటగది పరిశుభ్రత పాటించట్లేదు. దాదాపు ప్రతి హోటల్లో మూడు నాలుగు రోజుల క్రితం వండిన చికెన్, మటన్ వంటకాలను ఫ్రిజ్‌ల్లో ఉంచుతున్నారు. వంటగదిలో బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయి. గోడలపై బూజు పేరుకు పోయి ఉంటోంది. వంట చేసేటప్పుడు చెమటలు పట్టి పాత్రల్లో పడుతున్నా పట్టించుకోవడం లేదు. కూరల్లో పడుతోన్న తలవెంట్రుకలనూ అలాగే వదిలేస్తున్నారు. స్విగ్గీ, జొమాటోలపై రోజుకి జీహెచ్‌ఎంసీకి 3, 4 ఫిర్యాదులు అందుతుంటాయి. ఆన్‌లైన్ ఆర్డర్‌కి వేరే రకం బిర్యానీనీ అందిస్తుంటామని ఓ హోటల్ యజమాని అధికారులకు తెలియజేశారు. వాళ్లు తక్కువ ధర ఇస్తుంటారని అందుకే అలా చేయవలసి వస్తుందని తాము చేసే పనిని సమర్థించుకుంటున్నారు