సోషల్ మీడియాకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

SMTV Desk 2019-10-23 16:10:24  

సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు వార్తలు, అప్రదిష్టాకరమైన పోస్టులు, జాతి వ్యతిరేక కార్యకలాపాలు వంటి వాటిని నియంత్రించడానికి వచ్చే జనవరి 15 లోగా కొత్త నిబంధనలను తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలకు సంబంధించిన సంకేత భాషను ప్రభుత్వానికి అందచేయాలంటూ మద్రాసు, బొంబాయి, మధ్యప్రదేశ్ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లకు సంబంధించిన పెండింగ్ కేసులన్నిటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంది.జాతీయ భద్రతపై ప్రభావం చూపించే ఈ కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, వాట్సాప్ కోరుతుండగా ఈ అభ్యర్థనను మన్నిస్తూ ఆ కేసులను బదిలీ చేయడానికి అంగీకరిస్తూ సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని కేసులపై జనవరి చివరివారంలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. అయితే, సుప్రీంకోర్టుకు కేసుల బదిలీపై సోషల్ మీడియా కంపెనీల వాదనను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ నేడు సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపిస్తూ అవసరమైతే విశ్లేషణ కోసం సంకేత భాషలో తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్ కంపెనీలు ప్రభుత్వానికి అందచేయవలసి ఉంటుందని కోరారు.