పిఓకెపై భారత సైన్యం దాడులు బూటకం

SMTV Desk 2019-10-21 18:59:14  

ఇస్లామాబాద్: పాక్‌ ఆక్రమిత్ కశ్మీరులోని మూడు ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దళాలు దాడులు చేసినట్లు భారత సైనిక దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ ఆదివారం చేసిన ప్రకటనను పాకిస్తాన్ సైన్యం ఖండించింది. భారత్ వాదన నిజమే అయితే విదేశీ దౌత్యవేత్తలు లేదా మీడియాతో పాక్ ఆక్రమిత కశ్మీరును(పిఓకె) సందర్శించి నిరూపించాలని పాక్ సైన్యం సవాలు చేసింది. జమ్ము కశ్మీరులోని తంగ్‌ధర్, కేరాన్ సెక్టార్ల ఎదుట భారత సైన్యం జరిపిన ప్రతీకార దాడులలో ఆరుగురు నుంచి పది మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా మూడు ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయని ఆదివారం బిపిన్ రావత్ ప్రకటించారు. కాగా, ఆదివారం అర్థరాత్రి పాకిస్తాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఒక ట్వీట్ చేస్తూ రావత్ ప్రకటనను ఖండించారు.

రావత్ వంటి సైనిక దళాల ప్రధానాధికారి నుంచి ఇటువంటి ప్రకటన రావడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాక్‌లో ఉగ్ర శిబిరాలు ఏవీ లేవని, వాటిని ధ్వంసం చేశామన్న వాదనను నిరూపించుకోవడానికి పాక్‌లోని భారత దౌత్యకార్యాలయం విదేశీ దౌత్యవేత్తలను లేదా మీడియాను ఆ ప్రాంతాన్ని సందర్శించుకోవచ్చని ఆయన సవాలు చేశారు. పుల్వామా సంఘటన తర్వాత భారత సైనిక నాయకత్వం చేస్తున్న బూటకపు ప్రకటనల వల్ల ఆ ప్రాంతంలో శాంతికి విఘాతం ఏర్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ స్వప్రయోజనాల కోసం భారత సైన్యం ఇటువంటి వాదనలు చేస్తోందని, ఇది సైనిక నైతిక విలువలకు విరుద్ధమని గఫూర్ ఆరోపించారు.