బిజెపిలో అత్యంత నిజాయితీపరుడు ఎవరో చెప్పిన రాహుల్ గాంధీ

SMTV Desk 2019-10-21 18:57:58  

న్యూఢిల్లీ: బిజెపిలో అత్యంత నిజాయితీపరుడని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎవరికి కితాబు ఇచ్చారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇవిఎంపై ఏ మీట నొక్కినా బిజెపికే వెళుతుందని నిజాయితీగా వాస్తవాన్ని బయటపెట్టిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల బిజెపి అభ్యర్థి బక్షిష్ సింగ్ విర్క్‌ను ఆ పార్టీలోనే అణిముత్యంగా రాహుల్ అభివర్ణించారు. అయితే వివాదాస్పద వ్యాఖ్య చేసిన బక్షిష్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు జారీచేసింది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైన నేపథ్యంలో రాహుల్ గాంధీ తన టిట్టర్ ఖాతా ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతోపాటు హర్యానాలోని అస్సంద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బక్షిష్ ఇటీవల ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. మీరు ఎవరికి ఓటు వేసినా మాకు తెలుస్తుంది..మాకు తెలియదని అనుకోకండి. మేము కావాలనే మీకు ఆ విషయం చెప్పము.

మేము తెలుసుకోవాలంటే అదేమీ పెద్ద పని కాదు. మాకు మోడీజీ(ప్రధాని), మనోహర్‌లాల్(ముఖ్యమంత్రి) లాంటి మేధావులు ఉన్నారు..అంటూ ఆ వీడియోలో బక్షిష్ వ్యాఖ్యానించడం వినిపించింది. అంతేగాక మీరు మీ ఇష్టమైన వారికి ఓటు వేసుకోండి..కాని మీ ఓటు కమల్(బిజెపి ఎన్నికల చిహం కమలం)కే వెళుతుంది. మీరు ఏ బటన్ నొక్కినా బిజెపికే వెళుతుంది. ఇవిఎం యంత్రాలలో మేము ఒక పరికరాన్ని అమర్చాము..అని కూడా ఆయన ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల కమిషన్ ఆదివారం బక్షిష్‌కు నోటీసు జారీ చేసింది. ఇదిలా ఉంటే తనను అప్రదిష్ట పాల్జేయడానికి ఒక బూటకపు వీడియోను తయారు చేశారని బక్షిష్ వాదిస్తున్నారు. తాను ఇవిఎంలపై ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. కొందరు మీడియా ప్రతినిధులు ఈ పనిచేసి మొత్తం విషయాన్నే వక్రీకరించారని ఆయన తెలిపారు. తాను ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తానని, ఇవిఎంలపై తనకు విశ్వాసం ఉందని కూడా ఆయన తెలిపారు.