మనిషికి కావాల్సిన మూడు....!!!

SMTV Desk 2019-10-19 14:45:27  

నలుగురికి మంచి చేయకపోయినా పర్లేదు. చెడు మాత్రం చేయకూడదు అంటారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తు లక్షలు కూడబెడ్తున్నారు.. ‘సంతోషంగా బతుకుతున్నారా అంటే?’.. లేదంటారు. పనుల ఒత్తిడి, విపరీతమైన ఆలోచనలు, మానసిక సంఘర్షణలతో బాధపడుతున్నారు. వీటన్నింటికి మూలకారణం.. మనిషిలో ఉండాల్సిన సంస్కారం తగ్గిపోవడమే. సంస్కారాన్ని నింపే ఒడి, గుడి, బడి నుంచి నేర్చుకోవాల్సినవి నేర్చుకోకపోవడమే..
*అమ్మే లోకం:
ప్రతి ఒక్కరికీ అమ్మే మొదటి గురువు. అందుకే అమ్మను మించిన దైవం లేదంటారు. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవించిన వాళ్లు పెరిగి పెద్దయ్యాక కూడా ఆ ప్రేమ తాలూకు అనుభూతిని మర్చిపోరు. చిన్నప్పుడు అమ్మ నేర్పే ప్రతి మాట, ప్రతి ఆట.. జీవితాంతం గుర్తుండి పోతాయి. పిల్లలను తీర్చిదిద్దడంలో అమ్మకంటే ఎవరూ గొప్పకాదు. పుట్టిన ప్రతి ఒక్కరూ అమ్మ కళ్లతోనే లోకాన్ని చూస్తారు. చిన్నప్పుడు అమ్మను అనుకరిస్తూ అమ్మనుంచే అన్నీ నేర్చుకుంటారు. పాలు పట్టడం, స్నానం చేయించడం, నిద్రపుచ్చడం… అమ్మే అన్నీ చేస్తుంది. అమ్మ పిల్లలకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టడమే కాకుండా తప్పు చేస్తే దండిస్తుంది. మంచి పనిచేస్తే మెచ్చుకుంటుంది. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. సరైన జీవితానికి కావాల్సిన పునాదిని అమ్మే వేస్తుంది.
*భారం వేస్తాం..:
మనిషికి ప్రశాంతత ఇచ్చేది గుడి. ఎలా అంటే.. గుడిలోకి వెళ్లగానే భక్తులు అప్పటి వరకు మనసులో ఉన్న ఆలోచనలన్నింటిని పక్కన పెడతారు. మనసును దేవుడి మీద నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఉండే ధూపదీపాలు, భక్తులు, గుడి నిర్మాణం, మంత్రాలు, అగరొత్తులవాసన.. అన్నీ మనసుకు ప్రశాంతత ఇస్తాయి. కొన్ని దేవాలయాల్లో చెట్లు, వాటి నుంచి వచ్చే గాలి.. మనసుకు ఊరట ఇస్తాయి. అందుకే గుళ్లను కేవలం దేవుళ్లను పూజించే ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, మనిషి ప్రవర్తనను మార్చే ఆలయాలుగా కూడా చూడాలి. మనసు బాగాలేనప్పుడు కొందరు గుడికి వెళ్లి ఒక గంటసేపు కూర్చొని వస్తుంటారు. నిస్సహాయతలో, ఏమి చేయలేనప్పుడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు.. దేవుడి మీద భారం వేస్తారు. తమకు ఒక అండ దొరికిందన్న భరోసాతో ముందుకు వెళ్తారు. గుడిలో ప్రసాదాన్ని దేవుడి పేరు మీద అందరికీ పంచి పెట్టడం వెనుక కూడా ఓ మంచి ఆలోచన దాగి ఉంది. సంపాదించుకున్నదంతా దాచుకోవడానికే కాదు, ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్లను ఆదుకోవడానికి కూడా అనే ఆలోచన ఈ ప్రసాదం పంచడంలో ఉంది. గుడి మనిషిని మంచివైపు నడిపించే ఒక మార్గాన్ని చూపిస్తుంది.
*బుద్ధులు నేర్పే బడి:
అమ్మ తర్వాత ప్రతి ఒక్కర్నీ సంస్కారవంతులుగా తీర్చి దిద్దేది బడే. ఏది తప్పు, ఏది ఒప్పు అని పాఠాలు, ప్రవర్తన ద్వారా నేర్పుతుంది. మంచిగా బతకడానికి కావాల్సిన మార్గాన్ని చూపుతుంది. బడి అంటే డాక్టర్లు, ఇంజినీర్లు, ఉద్యోగులను తయారు చేసేది మాత్రమే కాదు. తోటి వాళ్లతో కలిసి సంతోషంగా ఎలా బతకాలో నేర్పేది. మానవత్వంతో బతకడం, ప్రకృతితో కలిసి జీవించడం, తోటి మనిషిని ప్రేమించడం.. ఎలాగో చూపేది. అందుకే బడి కూడా సంస్కారం నేర్పే దేవాలయం లాంటిదే. మానసికంగా ఎదగడానికి కావాల్సిన ఆలోచనలు స్కూల్లోనే ఎక్కువగా నేర్చుకుంటారు. ప్రకృతి, సమాజం, మనుషులు, టెక్నాలజీ, మానవ బంధాలు.. అన్నింటిని స్కూల్లోనే పాఠాలు, గురువులు, తోటి పిల్లల ద్వారా తెలుసుకుంటారు. అందుకే ఒక మనిషి పెరిగి పెద్దయ్యాక దుర్మార్గుడిగా మారినా, మంచి వ్యక్తులుగా గుర్తింపు పొందినా అందుకు పునాది బడిలోనే పడుతుంది. అందుకే బడిని మనిషికి సంస్కారం నేర్పే ఒక కేంద్రంగా చెప్పొచ్చు.