సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ తో అనుసంధానించాలి!!

SMTV Desk 2019-10-14 15:24:00  

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచమంతా కుగ్రామంలా మారిపోయింది. ఎలాంటి సమాచారంమైనా క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. అయితే, వాస్తవాల కంటే అవాస్తవాలే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారమవుతుండం బాధను కలిగించే అంశం. నచ్చని వ్యక్తులపై విషం కక్కేందుకు, జనాలను రెచ్చగొట్టేలా విద్వేషాలను పెంచేందుకు సోషల్ మీడియా ఒక వేదికగా మారింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అశ్విని ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రతి ఒక్క అంశం సుప్రీంకోర్టుకు రావాల్సిన అవసరం లేదని... మద్రాస్ హైకోర్టులో ఇదే అంశంపై విచారణ జరుగుతోందని, అక్కడకు వెళ్లాలని పిటిషనర్ కు సూచించింది.

ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫేక్, పెయిడ్ వార్తలు ప్రచారమవుతున్నాయని... ఇలాంటి అకౌంట్లకు చెక్ పెట్టాలని అశ్విని ఉపాధ్యాయ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికలకు 48 గంటల ముందు వచ్చే పెయిడ్ వార్తలు, రాజకీయ యాడ్లను కూడా ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 ప్రకారం అవినీతిగానే గుర్తించాలని కోరారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. మన దేశంలోని 3.5 కోట్ల ట్విట్టర్ ఖాతాల్లో 10 శాతం డూప్లికేటేనని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల పేర్లతో కూడా ఫేక్ అకౌంట్లను సృష్టిస్తున్నారని తెలిపారు.