నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు... యువతి మృతి

SMTV Desk 2019-10-14 14:31:55  

ఓ యువతితో నిశ్చితార్థం చేసుకుని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడో ప్రబుద్ధుడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ జవహర్ నగర్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

గుంటూరు జిల్లా కారెంపూడి మండలం నెర్మటపేట గ్రామానికి చెందిన గొర్ల సుబ్బలక్ష్మి, తన కూతురు మల్లీశ్వరి (24), కొడుకుతో కలిసి యాప్రాల్‌ పరిధిలోని చిన్నకందిగూడకు కొన్నాళ్లక్రితం వలస వచ్చింది. రెండేళ్ల క్రితం సమీప బంధువైన మారం సుధాకర్‌తో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించింది. నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి చేద్దామనుకునేలోగా మళ్లీశ్వరి బంధువు మృతి చెందడంతో పెళ్లి వాయిదా పడింది.

ఆ తర్వాత పెళ్లి చేద్దామనే సమయానికి సుధాకర్‌ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆశ్చర్యపోయిన బాధిత కుటుంబం ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కౌన్సెలింగ్‌, బంధువులు నచ్చజెప్పడంతో పెళ్లికి అంగీకరించాడు. అయితే, తాజాగా తాను మరో పెళ్లి చేసుకున్నానంటూ ఈనెల 9వ తేదీన బాధిత యువతి కుటుంబానికి సమాచారం అందించాడు.

ఈ వార్తతో మనస్తాపం చెందిన యువతి 11న పురుగుల మందు తాగేసింది. తీవ్ర అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.