సీఎం కేసీఆర్ అవలంభిస్తోన్న తీరును ప్రశ్నించిన సామాన్య వ్యక్తి .. వైరల్ అవుతున్న ఆడియో

SMTV Desk 2019-10-14 14:30:44  

అవినీతి, ఇతర ఫిర్యాదుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు తాజాగా ఓ వ్యక్తి కాల్ చేయడం.. తన ఆవేదనంతా వెళ్లగక్కి.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం పెద్ద చర్చకు దారి తీసింది.. సీఎంవోకు ఫోన్ చేసిన సదరు వ్యక్తి సీఎంతో జరిపిన సంభాషణను రికార్డు చేసి సోషల్ మీడియాలో వదలడంతో ఇప్పుడు అదికాస్త వైరల్‌గా మారిపోయింది.. ఏ వాట్సాప్ గ్రూప్‌లో చేసినా.. ఏ ఎఫ్‌బీ వాల్‌పై చూసినా అదే అనే తరహాలో వైరల్‌ అయ్యింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. సీఎం కేసీఆర్ అవలంభిస్తోన్న తీరును ఏమాత్రం బెరుకు, భయం లేకుండా.. తాను చెప్పాల్సిందంతా సూటిగా చెప్పేశాడా వ్యక్తి.

ఇక ఫోన్ సంభాషణను పరిశీలిస్తే.. "నా పేరు రంజిత్‌ కుమార్‌.. మాది కరీంనగర్‌. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఏందీ అల్లకల్లోలం? స్కూళ్లకు ఇప్పటికే పదహారు రోజులు సెలవులిచ్చారు. పిల్లలు ఇప్పటికే అంతా మర్చిపోయారు. ఇంకా వారం రోజులు పొడగించడమా.. స్కూలు బస్సులను వాడుకోవడమేంటి? వాళ్లేదో సమ్మెజేస్తే.. ఈయన అహంకారం కొద్ది మమ్మల్ని ఇబ్బంది పెట్టుడేంది? వాళ్లు, వీళ్ల మధ్యలో మేం నలిగిపోవుడేంది? పిల్లలు నలిగిపోవుడేంది? మాకు ఇబ్బంది కలగడం లేదా? ముఖ్యమంత్రి తండ్రిలాంటోడు. పిల్లలు అల్లరి జేస్తే పిలిచి మాట్లాడి, పదిమందిని పిలిచి బుద్ధి చెప్పాలే. నువ్వు పోతేపో.. నేను పీకేస్తా అంటూ కయ్యానికి కాలు దువ్వడం ఎందుకు? అది పద్ధతేనా? అట్లా మాట్లాడవచ్చా? ఆర్టీసీ మాకోసమే ఉంది, సీఎం మా కోసమే ఉన్నారు? కానీ వాల్లువాల్లు కొట్టుకుంటే మేం నష్టపోతున్నాం. సీఎం ప్రజలను లెక్కజేయరు. ఎవరి కోసం పాలన? ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకొన్నాం. ఉద్యమాలతో తెలంగాణ తెచ్చుకున్నం. అటువంటి ఉద్యమాలనే అణిచివేస్తారా? ప్రజలను, ఉద్యోగులను కన్న బిడ్డల్లా చూసుకోవాలి. నేను విన. నేను జేయ అంటే నడవదు. ఇది ప్రజా స్వామ్యం కాదా...? దీనిని సార్‌ దృష్టికి తీసుకువెళ్లండి.. అంటూ కుండబద్దలు కొట్టినట్టుగా తన అభిప్రాయాన్ని మొత్తం సీఎంవో హెల్ప్‌డెస్క్‌కు విన్నవించాడు. ఇది కాస్త వైరల్‌గా మారిపోయింది.. చివరకు టీవీ ఛానెళ్లు, పత్రికల్లో కూడా ఈ ఫోన్ కాల్‌పై కథనాలు వెలువడే స్థాయికి వెళ్లింది.