జగన్ కు చంద్రబాబు లేఖ.... అందులో ఏముందంటే!!

SMTV Desk 2019-10-01 15:12:50  

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధి హామీ పథకం పనుల నిలిపివేత, పెండింగ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరితో జీవనోపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పేదలు బతకాలా? వద్దా? అని ప్రశ్నించారు. కూల్చివేతలు, నిలిపివేతలు, రద్దులతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు.

రాజకీయాలకు తెరదించి, ఉపాధిహామీ పనులకు నిధులను విడుదల చేయాలని అన్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పారు. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

టీడీపీ హయాంలో కన్వర్షన్ విధానంతో 22 శాఖల్లోని నిధులను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకానికి అనుసంధానించామని... అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేశామని... టీడీపీ హయాంలో దేశానికి ఏపీ ఒక నమూనాగా ఉండేదని చెప్పారు. వందకు పైగా అవార్డులను సాధించామని గుర్తు చేశారు.