వరద నీటిలో అందాలభామ ఫొటోషూట్!!

SMTV Desk 2019-10-01 15:11:35  

కొన్నిరోజులుగా బీహార్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని పాట్నా సహా చాలా ప్రాంతాలు వరద బారినపడ్డాయి. డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ కుటుంబాన్ని సైతం ఓ పడవలో సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఓ అందాలభామ వరద నీళ్లలో మోడలింగ్ ఫొటోషూట్ చేయడం విమర్శలకు దారితీసింది.



అదితి సింగ్ అనే ఫ్యాషన్ విద్యార్థిని వెరైటీగా ఉంటుందని వరద నీళ్లలో ఫొటోలకు పోజులిచ్చింది. వరదల్లో ఓవైపు ప్రజలు నానా అగచాట్లు పడుతున్న నేపథ్యంలో, మోడ్రన్ డ్రెస్ వేసుకున్న అదితి చిరునవ్వు ముఖం నిండా పులుముకుని ఫొటోషూట్ చేసింది. పాపం, ఆమె ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ ఓ వైపు చేతిలో గొడుగు పట్టుకుని, మరోవైపు కెమెరాతో చచ్చీచెడీ ఫొటోషూట్ పూర్తిచేశాడు.

అదితి సింగ్ పాట్నాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్. వరదలతో పాట్నా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో అందరికీ చూపించడానికే తాను ఫొటోషూట్ చేశానని అదితి చెబుతుండగా, ఓవైపు వరదల్లో ఎంతోమంది మృతి చెందగా, లక్షలమంది నిరాశ్రయులైన నేపథ్యంలో ఆమె నవ్వుతూ ఎలా ఫొటోలు తీయించుకుంటుంది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.