150 మిలియన్‌ డాలర్ల రుణం ప్రకటించిన మోదీ

SMTV Desk 2019-09-26 18:04:53  

సౌర, పునరుత్పాదకత, పర్యావరణ, వాతావరణ సంబంధిత ప్రాజెక్టులను చేపట్టేందుకు గాను పసిఫిక్‌ ద్వీప దేశాలకు రూ.150 మిలియన్‌ డాలర్ల రుణం ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సభ్యదేశాలు తమకు నచ్చిన ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించుకునేందుకు 12 మిలియన్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇండియా పసిఫిక్‌ ఐలాండ్స్‌ డెవలపింగ్‌ స్టేట్స్‌ (పిఎస్‌ఐడిఎస్‌) సమావేశానికి హాజరైన ఆయన ఈ రుణాన్ని ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి 74వ సర్వసభ్య సమావేశం అనంతరం మంగళవారం ఈ సమావేశం జరిగింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో సహకారాన్ని పెంచుకోవడం, విపత్తుల నివారణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కోసం కొత్తగా ఏర్పాటు చేసిన కూటమిలో చేరడం, భారత్‌, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి భాగస్వామ్య నిధి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పిఎస్‌ఐడిఎస్‌, భారత్‌ల మధ్య పరస్పర సహకారం కోసం రోడ్‌మ్యాప్‌ ఏర్పాటుపై చర్చించారు. పిఎస్‌ఐడిఎస్‌కు చెందిన పలువురు దేశాధినేతలను ప్రధాని మోడీ తొలిసారి కలిసిన సందర్భంగా పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. ఈ సమావేశంలో ఫిజి, రిపబ్లిక్‌ ఆఫ్‌ కిరిబాటి, మార్షల్‌ ఐలాండ్స్‌, మైక్రోనేషియా, నౌరు, పలవ్‌, పపువాన్యుగినియా, సమోవా, సాల్మన్‌ ఐలాండ్స్‌, టోంగా, తువాలు, నవాటు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. దీనిపై మోడీ మాట్లాడుతూ ఆ దేశాలతో భారతదేశానికి సత్సంబంధాలున్నాయని, ప్రజల జీవన ప్రమాణాల్లో అసమానతలు తగ్గించేందుకు అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.