టీడీపీ నేత అరెస్టు

SMTV Desk 2019-09-26 18:02:49  

2013లో గ్రామం విడిచి వెళ్లిపోయిన సామేల్‌ అనే వ్యక్తి ఈ ఏడాది జూలై నెలలో తిరిగి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సహాయంతో గ్రామానికి తిరిగి వచ్చారు. తాను గ్రామం విడిచి వెళ్లేలా చేసింది కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డేనని ఆరోపిస్తూ కులం పేరుతో దూషిస్తూ వెలివేశాడని తాలుకా పోలీసు స్టేషన్‌లో జూలై 30వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో తాలుకా పోలీసులు విష్ణువర్ధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డిని అరెస్టు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశంతో పోలీసులు స్థానిక శ్రీనివాస నగర్‌లోని ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి నివాసం వద్ద కొంతమంది పోలీసులు మఫ్టీలో ఉదయం నుంచే కాపు కాశారు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న విష్ణువర్ధన్‌రెడ్డిని అక్కడ ఉన్న పోలీసులు ఆయనను ఇంట్లోకి కూడా వెళ్లనీయకుండా అరెస్టు చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విష్ణు అరెస్టు వార్త వినగానే ఆయన అనుచరులు పెద్దఎత్తున టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చారు. తమ నాయకుడ్ని అన్యాయంగా అరెస్టు చేశారని, విడిచిపెట్టాలని, వైసీపీ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులకు, విష్ణు అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. విష్ణును కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తుండగా కోర్టు వద్ద విష్ణు అనుచరులు గుమికూడారని తెలుసుకొని ఆ తర్వాత విష్ణును కోర్టుకు తీసుకెళ్లకుండా డీఐజీ బంగ్లాకు తరలించారు. అక్కడి నుంచి నేరుగా న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి విష్ణువర్ధన్‌రెడ్డికి రిమాండ్‌ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆయనను పంచలింగాలలో ఉన్న సబ్‌జైలుకు తరలించారు.