బ్లూవేల్ మధ్యలో ఆగిందా?

SMTV Desk 2017-08-31 16:11:38  Blue whale game, Assam, student, deadly game, suicide game

అసోం, ఆగస్ట్ 31: ప్రపంచ దేశాలను వణికిస్తున్న బ్లూ వేల్స్ గేమ్ ఇటీవల భారత్‌ని కూడా ఆందోళనకు గురి చేయగా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి గూగుల్, యాహు, ఫేస్‌బుక్ వంటి అంతర్జాల దిగ్గజ సంస్థలకు బ్లూ వేల్స్ కి సంబంధించిన అన్ని లింక్ లను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ తాజాగా మరో ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అసోంలోని గౌహతిలో ప‌ద‌వ త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థి ఒక‌రు ఈ గేమ్ బారిన‌ప‌డి వింత‌గా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీంతో అనుమానం రావడంతో ఆ బాలుడిని పరిశీలించిన తల్లిదండ్రులు త‌న‌ చేతిపై పెట్టుకున్న‌ బ్లూవేల్ మార్క్ గమనించారు. కాగా, సదరు బాలుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా అత‌డి త‌ల్లిదండ్రులు గువ‌హ‌తి మెడికల్ కాలేజ్ ఆసుప‌త్రిలో చేర్పించారు. ఆ ఆసుప‌త్రి సుప‌రింటెండెంట్ ఈ బాలుడి మాన‌సిక‌ ప‌రిస్థితి గురించి మాట్లాడుతూ... ఆ బాలుడు ఆసుప‌త్రి నుంచి పారిపోయే ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నాడ‌ని అన్నారు. ప్రస్తుతం ఆ బాలుడికి సైకియాట్రిస్టులు చికిత్స చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఇదే గేమ్ బారిన పడి మధురైకి చెందిన విగ్నేష్ (19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.