బామ్మ హోటల్ లో ఏదైనా రూపాయికే!!

SMTV Desk 2019-09-11 15:13:59  

ప్రస్తుతం చిన్నస్థాయి హోటల్ లో టిఫిన్ చేయాలంటే కనీసం రూ.50-60 ఇట్టే అయిపోతున్నాయి. అలాంటిది రూపాయికే టిఫిన్ అందించాలంటే? ఇలాంటి అసాధ్యాన్ని తమిళనాడులోని ఓ బామ్మ సుసాధ్యం చేసి చూపిస్తోంది. కోయంబత్తూరులోని కమలాథల్(82) రోజూ ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేస్తుంది. అనంతరం రోజుకు వెయ్యి ఇడ్లీలు, బోండాలు(మైసూర్ బజ్జీలు) తయారు చేస్తుంది.

ఉదయం 6 గంటలకల్లా తన షాపును తెరుస్తుంది. ఆమె తయారుచేసిన ఇడ్లీ, సాంబార్, చట్నీ రుచి గురించి ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ టిఫిన్ తినిపోతూ ఉంటారు. ఈ హోటల్ లో కమలాథల్ ఒక్కో ఇడ్లీని రూపాయికే అందిస్తోంది. దీంతో రూ.10 పెట్టగానే కస్టమర్ల కడుపు నిండిపోతోంది.

ఈ విషయమై కమలాథల్ మాట్లాడుతూ..‘గత 30 ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నా. గతంలో ఒక్కో ఇడ్లీ, బోండాను 50 పైసలకే అందించేదాన్ని. అయితే సరుకుల ఖరీదు పెరగడంతో రూపాయికి అమ్ముతున్నా. అందరూ నా టిఫిన్ ను మెచ్చుకుంటారు’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఎవరైనా డబ్బులు లేకుండా టిఫిన్ తిన్నా, పది రూపాయలకు తిని, రూ. 5లే చేతిలో పెట్టినా ఈ బామ్మ వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయట.