ఎస్‌బీఐ తాజా నిర్ణయం... సర్వీస్ ఛార్జీల రూపంలో అదనపు భారం

SMTV Desk 2019-09-09 11:43:26  

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) లక్షలాదిమంది ఖాతాదారులతో దేశంలోనే నెంబర్ 1 ప్రభుత్వరంగ బ్యాంక్‌గా నిలిచింది. అయితే ఏదో ఓ పేరుతో ఖాతాదారుల నుంచి డబ్బు పిండుకోవడంలో కూడా నెంబర్ 1 అనే చెప్పక తప్పదు. ఓసారి ఖాతాదారులకు గొప్ప మేలు కల్పిస్తున్నామంటూ ఆన్‌లైన్‌ నగదుబదిలీలపై సర్వీస్ ఛార్జీలు ఎత్తేస్తున్నామని ప్రకటిస్తుంది. మళ్ళీ అంతలోనే ఏవో కొత్త ఛార్జీలు విధిస్తుంటుంది. అంటే కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకొంటుందని చెప్పవచ్చు. ఎస్‌బీఐ తాజా నిర్ణయం అటువంటిదే.

నగదు డిపాజిట్, ఉపసంహరణ, ఏటీఎం సేవలు, చెక్ వినియోగంపై ఎస్‌బీఐ మళ్ళీ పరిమితులు విధించి, ఆ పరిమితికి మించి వినియోగించుకుంటే ఖాతాదారుల నుంచి భారీగా సర్వీస్ ఛార్జీలు పిండుకోవడానికి సిద్దం అవుతోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఖాతాదారులు నెలకు మూడుసార్లు మాత్రమే నగదు జమా, ఉపసంహరణ చేయవచ్చు. అంతకు మించితే ప్రతీసారి రూ.50 సర్వీస్ ఛార్జీలు(జిఎస్టీ అధనం) చెల్లించాల్సి ఉంటుంది. చెక్ బౌన్స్ అయితే రూ.150+జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఆన్‌లైన్‌లో పరిమిత సంఖ్యలో ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలను నిర్వహిస్తే సర్వీస్ ఛార్జీలు ఉండవు కానీ నేరుగా బ్యాంకుకు వెళ్ళి నిర్వహిస్తే బాదుడు భరించాల్సి ఉంటుంది. ఆర్‌టీజీఎస్‌ ద్వారా రూ.2-5 లక్షల వరకు రూ.20, అంతకు మించితే రూ.40 ఛార్జీలు+జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఏటిఎం వినియోగంపై గతంలో విధించిన పరిమితిని పెంచింది. హైదరాబాద్‌, డిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలలో ఇక నుంచి ఉచితంగా 10సార్లు ఏటీఎంను వినియోగించుకోవచ్చు. మిగిలిన నగరాలు, పట్టణాలలో నెలకు 12సార్లు ఏటీఎంను వినియోగించుకోవచ్చు.

అయితే ఏటీఎంల ద్వారా నెలకు మూడు కంటే ఎక్కువసార్లు నగదు ఉపసంహరణ, జమా చేసినట్లయితే వాటికీ రూ.50 సర్వీస్ ఛార్జీలు+జిఎస్టీ వసూలు చేస్తుందా లేదా? అనే దానిపై స్పష్టత రావలసిఉంది. వసూలుచేసే మాటయితే ఆ అదనపు ఆదాయం కోసమే కక్కుర్తి పడి ఏటిఎం వినియోగంపై పరిమితిని పెంచిందని చెప్పకతప్పదు. అంటే ఎస్‌బీఐ కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకొంటుందని చెప్పవచ్చు.

కనుక ఉచితంగా 10-12సార్లు ఏటీఎం వినియోగించుకొనే అవకాశం దొరికింది కదా అని ఖాతాదారులు ఏటీఎం ద్వారా నెలకు మూడుసార్లకంటే ఎక్కువ నగదు ఉపసంహరణ, జమా చేసినట్లయితే మన బ్యాంక్ బ్యాలెన్స్‌లో నుంచి ప్రతీ లావాదేవీకి రూ.50 సర్వీస్ ఛార్జీలు+జిఎస్టీ కట్ అయిపోయే ప్రమాదం ఉంది. కనుక ఏటీఎం లావాదేవీలపై అదనపు బాదుడు ఉంటుందో లేదో తెలుసుకొన్నాకనే ఏటీఎం కార్డు బయటకు తీయడం మంచిది.