శ్రీశైలం ప్రాజెక్టు .. మరోసారి గేట్ల ఎత్తివేత!

SMTV Desk 2019-09-09 11:38:30  

గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా, శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలో ఓ అద్భుతం నేడు ఆవిష్కృతం కానుంది. కేవలం మూడు వారాల వ్యవధిలో నేడు జలాశయం గేట్లను రెండోసారి ఎత్తనున్నారు. గత నెలలో ఎగువ నుంచి వచ్చిన వరదకు దాదాపు రెండువారాల పాటు గేట్లను తెరచివుంచి, దిగువకు నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆపై పది రోజుల వ్యవధి తరువాత, ఎగువ నుంచి వస్తున్న వరద గణనీయంగా పెరగడంతో, నేడు గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి, ఎగువన ఉన్న తుంగభద్ర, జూరాల జలాశయం నుంచి వస్తున్న వరద 3 లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది. వివిధ కాలువల ద్వారా వదులుతున్న నీటితో పోలిస్తే, వస్తున్న వరద అధికంగా ఉంది. దీంతో నికరంగా జలాశయంలో నిల్వ పెరుగుతుండగా, మరికాసేపట్లో గేట్లను ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ కు మధ్య ఇప్పటికే పూర్తిగా నీరు నిండివుండగా, శ్రీశైలం గేట్లను ఎత్తివేసిన ఎనిమిది గంటల తరువాత సాగర్ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి.