నాల్గో టెస్టు మ్యాచ్‌లో స్మిత్ ఎంట్రీ

SMTV Desk 2019-08-31 13:03:03  

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ నాల్గో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. డెర్బీషైర్‌తో జరిగిన టూర్‌ మ్యాచ్‌లో నేరుగా పాల్గొన‍్నాడు. దాంతో నాల్గో టెస్టులో స్మిత్‌ ఆడటం దాదాపు ఖాయమే. డెర్బీ షైర్‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌ 23 పరుగులు చేశాడు. మరొకవైపు మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దీనిపై సహచర ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ మాట్లాడుతూ.. స్మిత్‌ 20 పరుగులు కొట్టాడా.. 220 కొట్టాడా అనేది విషయం కాదు. అతనికి ప్రాక్టీస్‌ ఎంతవరకూ లభించిందనేది ముఖ్యం. స్మిత్‌ ఫిట్‌ అయ్యాడు అని పేర్కొన్నాడు. యాషెస్‌ రెండో టెస్టులో ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అత్యంత వేగవంతంగా సంధించిన బౌన్సర్‌ స్మిత్‌ మెడ భాగంలో తగలడంతో అతను అక్కడికక్కడే కూలిబడిపోయాడు. ఆపై కాసేపటికి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌కు దూరమయ్యాడు. ఆపై మూడో టెస్టు నుంచి స్మిత్‌ వైదొలగక తప్పలేదు. కాగా, స్మిత్‌ గైర్హాజరీ ఒకటైతే, ఆ మ్యాచ్‌ను ఆసీస్‌ కోల్పోవడం కూడా వారిని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక నాల్గో టెస్టులో స్మిత్‌ రాకతో మళ్లీ గాడిలో పడతామని ఆసీస్‌ భావిస్తోంది. తొలి టెస్టులో ఆసీస్‌ గెలవగా, రెండో టెస్టు డ్రా ముగిసింది.