విలీనం తరువాత బ్యాంకుల్లో 55.81 లక్షల కోట్ల వ్యాపారం

SMTV Desk 2019-08-31 12:59:42  

10 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఈ విలీనం తర్వాత నాలుగు అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకులు ఏర్పడతాయి. దీని మొత్తం వ్యాపారం రూ .55.81 లక్షల కోట్లు. శుక్రవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2017లో దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా, విలీనంతో ఇప్పుడు అవి 12కు తగ్గాయి. ఆర్థిక మంత్రి మాట్లాడుతూ – గత సంవత్సరం ఎస్‌బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాల బ్యాంకుల విలీనం లాభపడిందని, రిటైల్ రుణ వృద్ధిలో 25 శాతం పురోగతి నమోదైందని తెలిపారు. సీతారామన్ తాజా ప్రకటన ప్రకారం, మరో ఆరు బ్యాంకులు పిఎన్‌బి, కెనరా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులలో విలీనమవుతాయి. నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులుగా అవతరిస్తాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ పిఎన్‌బిలో కలుస్తాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్‌లో విలీనం అవుతాయి. కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ కలిస్తే, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ విలీనం అవుతుంది. దేశంలో ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు 12కు చేరతాయి. ఎస్‌బిఐ తర్వాత పిఎన్‌బి అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఈ విలీనం వల్ల రుణ వ్యయం తగ్గుతుందని, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికి బలోపేతం అవుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇకపై రూ.250 కోట్లకు పైగా ఉన్న ప్రతి రుణాన్ని పర్యవేక్షించనున్నామని, మొండి బకాయిలు రూ.8.65 లక్షల కోట్ల నుంచి రూ.7.90 లక్షల కోట్లకు తగ్గాయని ఆర్థికమంత్రి తెలిపారు.