లవ్ ట్రైన్...సింగల్ గా ఎక్కితే మింగిల్ అయ్యి దిగుతారు!

SMTV Desk 2019-08-30 12:45:30  

ఇంకా ప్రేమలో పడకుండా తోడు కోసం చూస్తున్నారా? అయితే ఈ ట్రైన్ ఎక్కండి. సింగల్ గా ట్రైన్ ఎక్కిన మీరు కొత్త లవర్ తో దిగుతారు. ట్రైన్ ఎక్కితే లవర్ దొరకడం ఏంటీ అనుకుంటున్నారా? ఈ వార్త చదవండి ఒకసారి. చైనాలోని ప్రేమ, పెళ్లిల్లు లేకుండా సింగిల్‌గా మిగిలిపోయిన 200 మిలియన్ మంది కోసం ‘Y999 లవ్ పర్స్యూట్’ అనే ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చారు. వెయ్యి మంది యువతీ, యవకులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. రాత్రిపూట మాత్రమే ప్రయాణించే ఈ రైలులో సింగిల్స్ అంతా మింగిల్ అయ్యారు. రొమాంటిక్‌గా ముందుకు సాగిపోయారు. సింగిల్స్‌ను దృష్టిలో పెట్టుకుని మూడేళ్ల కిందటే ఈ ప్రయోగం చేపట్టారు. చాంగ్కింగ్ రైల్వే స్టేషన్‌లో ఓ క్రియేటివ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా రూపొందించారు. ఈ రైలు అమౌర్ అనే ప్రాంతానికి చేరి, తిరుగు ప్రయాణం అవుతుంది. గత మూడేళ్లలో 3 వేల మంది యువత ఇందులో ప్రయాణించారు. వీరిలో చాలామంది సింగిల్‌గా రైలెక్కి జంటగా తిరిగి వెళ్లారు. ఈ జంటల్లో ఇప్పటివరకు పది మంది పెళ్లి చేసుకున్నారు. ప్రేమ, పెళ్లి సంబంధాలు కలిపే ఓ సంస్థ, కమ్యునిస్ట్ యూత్ లీగ్ ఆఫ్ చాంగ్కింగ్, చెంగ్డూ రైల్వే అథారిటీతో కలిసి ఈ రైలును నడుపుతోంది. ఈ రైలు ప్రయాణం అస్సలు బోరు కొట్టకుండా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు. తమకు నచ్చిన వ్యక్తితో కలిసి డిన్నర్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. దీనివల్ల వారంతా ఎలాంటి బిడియం లేకుండానే కలిసిపోతున్నారు. జర్నీ మొత్తం ఆట పాటలు, మాటల్లో మునిగి పీకల్లోతు ప్రేమలో పడిపోతున్నారు. ఈ సందర్భంగా యాంగ్ హువాన్ అనే యువతి ఓ న్యూస్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘జర్నీ ప్రారంభంలో ఎవరినీ ఎంచుకోలేకపోయా. అయితే, రిటర్న్ జర్నీలో నాకో వ్యక్తి పరిచయమయ్యాడు. మా అభిప్రాయాలు కూడా బాగా మ్యాచ్ అయ్యాయి. కలిసి ఉన్నా.. ఇద్దరి వ్యక్తిగత జీవితాలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా నిర్ణయం’’ అని తెలిపింది.