దమ్ముంటే పీఓకేను కాపాడుకోండి...పాక్ ప్రభుత్వంపై బిలావల్ భుట్టో ఫైర్

SMTV Desk 2019-08-28 14:29:33  

పాకిస్థాన్ ప్రభుత్వానికి ఇంటాబయటా సెగ తప్పడంలేదు! జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు భారత్ ప్రకటించగా, అంతర్జాతీయ సమాజాన్ని రెచ్చగొట్టాలని చూసిన పాక్ కు భంగపాటే ఎదురైంది. ఇటు, స్వదేశంలో విపక్షం కూడా ప్రభుత్వాన్ని తూర్పారబడుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నుంచి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటిదాకా శ్రీనగర్ ను స్వాధీనం చేసుకోవడం అనేది పాక్ ప్రభుత్వ అజెండాగా ఉండేదని, ఇకపై ముజఫరాబాద్ (పీవోకే రాజధాని)ను కాపాడుకుంటే అదే గొప్ప విషయం అని పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు.

శ్రీనగర్ దాకా వెళ్లాల్సిన పనిలేదు, ముజఫరాబాద్ ను రక్షించుకోవడమే ప్రభుత్వ ప్రధాన పాలసీగా మారిపోయింది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాక్ ప్రభుత్వం బలహీన సిద్ధాంతాలు, విధానాలతో నెట్టుకొస్తోందని బిలావల్ విమర్శించారు. ఇమ్రాన్ స్వార్థపూరిత వైఖరితో పాక్ ప్రభుత్వ ప్రాధామ్యాలే మారిపోయాయని అన్నారు.