దొనకొండ రియల్ వ్యాపారులకు స్వర్గధామంగా

SMTV Desk 2019-08-28 14:26:21  

ప్రకాశం జిల్లా దొనకొండ రియల్ వ్యాపారులకు స్వర్గధామంగా మారింది. ఏపీ రాజధాని అమరావతి నుంచి దొనకొండకు తరలనుందన్న ప్రచారం అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ ను పెంచేసింది. ఒకప్పుడు పదిలక్షల రూపాయలు కూడా పలకని భూమి ధరలు ఇప్పుడు కోటిరూపాయలకు చేరాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల రాకపోకలతో దొనకొండ రద్దీ ప్రాంతంగా మారిపోయింది. సరిగ్గా చెప్పాలంటే రాజధాని గురించి ప్రకటన చేసిన కొత్తలో తుళ్లూరు ఎలా ఉందో ఇప్పుడు దొనకొండ అలా ఉంది. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధాని రేసులో ముందు దొనకొండ పేరే బాగా వినిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై చిదంబరం 2009లో ప్రకటన చేసే నాటికే దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా పరిశీలించారని వార్తలొచ్చాయి.
దీంతో అప్పట్లో దొనకొండ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగింది. కానీ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలవడం, తుళ్లూరును రాజధానిగా ఎంపిక చేయడంతో దొనకొండ సంగతి అందరూ మర్చిపోయారు. అయితే కృష్ణమ్మ వరదల కారణంగా అమరావతిపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందన్న ప్రచారంతో దొనకొండలో మళ్లీ సందడి మొదలయింది. రేట్లు మరింత పెరగకముందే భూములు కొనుక్కునేందుకు రియల్ వ్యాపారులు పోటీపడుతున్నారు. దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో 50వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎయిర్ పోర్టు, రైల్వే జంక్షన్ కూడా దొనకొండకు అనుకూలంగా మారాయి. దొనకొండ అన్ని విధాలా అభివృద్ధి చెందే అవకాశముందన్న భావనతో ఇక్కడ భూములు కొనుక్కునేందుకు కడప, కర్నూల్, ప్రకాశం, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వస్తున్నారు. సరైన రోడ్డు సదుపాయం కూడా లేని చోట ఖరీదైన కార్లు నిరంతరాయంగా రాకపోకలు సాగిస్తున్నాయి.