మిశ్రమ ప్రదర్శనతో మొదటి రోజు

SMTV Desk 2019-08-23 10:49:40  

టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో మొదటి మ్యాచ్ బ్యాటింగ్‌తో మొదలు పెట్టిన టీమిండియా.. మిశ్రమ ప్రదర్శనతో మొదటి రోజు ఆటను ముగించింది.. ఓ దశలో తీవ్ర కష్టాల్లో.. పడ్డ కోహ్లీ సేన రహానే, రాహుల్ పుణ్యమా అని గౌరవప్రదమైన స్కోరుతో ఆటను కొనసాగిస్తుంది.
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విండీస్‌ బౌలర్లు చెలరేగుతున్నారు. పిచ్‌పై ఉన్న తేమను ఉపయోగించుకొంటూ.. టీమిండియా టాప్‌ ఆర్డర్‌ని కుదేలు చేశారు. ఐదో ఓవర్‌లోనే మయాంక్‌ అగర్వాల్‌, పుజారాలను పెవీలియన్ పంపాడు కీమర్‌ రోచ్‌. ఆపై గాబ్రియల్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. దీంతో ఎనిమిది ఓవరల్లకు టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసి తీవ్ర కష్టాల్లో పడింది టీమిండియా.
కరేబియన్ బౌలర్లు రెచ్చి పోతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌, అజింక్య రహానె ఆచితూచి ఆడారు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న సమయంలో.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 44 పరుగులతో కొద్దిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో కీపర్‌ షైహోప్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. రాహుల్‌ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన హనుమ విహారి. రహానె మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పేలా కనిపించాడు.
ఈ సమయంలో తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు వరుణుడు. ఇన్నింగ్స్‌ 47.2 ఓవర్‌లో వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్‌కు తాత్కాలిక విరామం ప్రకటించారు. వాన తగ్గిన వెంటనే.. టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. రహానెతో కలిసి ఇన్నింగ్స్‌ నిలబెడుతూ వచ్చిన విహారి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 55వ ఓవర్‌లో రోచ్‌ బౌలింగ్‌లో ఐదో బంతికి.. వికెట్‌కీపర్‌ షైహోప్‌ చేతికి చిక్కాడు.
నిలదొక్కుకుంటుందన్న సమయంలో.. టీమిండియా మళ్లీ కష్టాల్లో పడింది. విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నట్లే కనిపించిన అజింక్య రహానె పెవిలియన్‌కు చేరుకున్నాడు. గాబ్రియల్‌ వేసిన 60వ ఓవర్‌ నాలుగో బంతికి రహానె.. క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో.. స్టంప్స్ సమయానికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్‌ పంత్‌, జడేజా ఉన్నారు.