ఎన్ని గిమ్మిక్కులు చేసిన ఆయనగారి నాటకాలు సాగవు

SMTV Desk 2019-08-19 14:26:07  

హైదరాబాద్ : గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కెటిఆర్ మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలు టిఆర్‌ఎస్ వైపు ఉన్నారని, ఈ విషయం గత కార్పొరేషన్ ఎన్నికల్లోనే నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ఇప్పుడు తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారిందని ఆయన చెప్పారు. తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు ఏకపక్షం కావాలని ఆయన పేర్కొన్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా బిజెపి నేత నడ్డా నాటకాలు తెలంగాణలో నడవవని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో బిజెపికి అధికారం జీవితాంతం ఆమడదూరంలోనే ఉంటుందని, బిజెపి నేతలు పగటికలలు కనడం మానేయాలని ఆయన ఎద్దేవా చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి నేతలు చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బిజెపి నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారా అని కెటిఆర్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారి వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కెటిఆర్ సవాల్ చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

దేశంలోనే బెస్ట్ సిఎంగా కెసిఆర్ నిలిచారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇంజినీర్ అవతారమెత్తి మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కెసిఆర్ పూర్తి చేశారని ఆయన కొనియాడారు. బిజెపి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో కాళేశ్వరం వంటి ప్రాజెక్టును కట్టలేదని ఆయన విమర్శించారు. ఏ రాష్ట్రంలోనూ కళ్యాణ లక్ష్మి వంటి పథకం లేదని ఆయన చెప్పారు. బిజెపి నేతలు అన్ని మాయమాటలే చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగు నీళ్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని మల్లారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.