రాత్రిపూట ప్రియురాలు చాటింగ్ ఒప్పుకోకపోవడంతో యువకుడి ఆత్మహత్య

SMTV Desk 2019-08-19 14:23:49  

ప్రేమలో పడిన ఓ యువకుడు, అర్ధరాత్రి వరకూ చాటింగ్ చేసి, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు రాత్రిపూట చాటింగ్, ఫోన్ చేయవద్దని సదరు యువతి చెప్పడంతో, మనస్తాపానికి గురై, మూడవ అంతస్తు పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్, బాలాపూర్ సమీపంలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇక్కడి జిల్లెలగూడలో ఉంటూ, ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న సందీప్ (30) గత కొంతకాలంగా కూకట్ పల్లికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. విషయం రెండు కుటుంబాల వారికీ తెలుసు. పెళ్లికి ఎవరూ అంగీకరించలేదు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వరకూ ఇద్దరి మధ్యా చాటింగ్ జరిగింది. తాను ఫోన్ చేస్తానని సందీప్ చెప్పగా, తన పక్కనే చెల్లెలు ఉందని, ఇక ఫోన్ చేయవద్దని ఆమె చెప్పింది. దీంతో అతను మనస్తాపంతో భవంతి మూడవ అంతస్తు పైనుంచి కిందకు దూకాడు.

కాగా, ప్రేమ నేపథ్యంలో, అమ్మాయి తరఫువారు తమ బిడ్డను చంపేసి, మృతదేహాన్ని అక్కడ పడేసి వుండవచ్చన్న అనుమానాలను సందీప్ తల్లిదండ్రులు వ్యక్తం చేయడంతో ఆ కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నారు. ఘటనా స్థలిలో హత్య జరిగిన ఆనవాళ్లు లేవని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, రిపోర్టు వచ్చిన తరువాత మృతికి కారణం తెలుస్తుందని తెలిపాయి.