బంతి తగలడంతో నేలకొరిగిన స్మిత్...నవ్వుతూ కనిపించిన ఆర్చర్, బట్లర్‌

SMTV Desk 2019-08-18 14:20:35  

లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్‌స్మిత్‌పైకి వరుస బౌన్సర్లని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు సంధించగా.. ఓ బంతి అతని మెడకి బలంగా తాకడంతో స్మిత్ కుప్పకూలాడు. దీంతో.. మైదానంలోని ఇంగ్లాండ్ క్రికెటర్లు కొంత మంది అతడి చుట్టూ చేరి సపర్యలు చేసేందుకు ప్రయత్నించగా.. బౌలర్‌ జోప్రా ఆర్చర్ మాత్రం జోస్ బట్లర్‌తో కలిసి మైదానంలో హేళనగా నవ్వుతూ కనిపించాడు. ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్‌ ఫిలిప్ హ్యూస్ బౌన్సర్ తగిలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 258 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలోనే నాలుగు వికెట్లు చేజార్చుకుని 71/4తో నిలిచింది. ఈ దశలో సహనంతో క్రీజులో నిలిచిన స్టీవ్‌స్మిత్ (92: 161 బంతుల్లో 14x4) ఇంగ్లాండ్ బౌలర్లకి ఎదురునిలిచాడు. బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులతో జోప్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్‌వోక్స్, బెన్‌స్టోక్స్.. అతడ్ని ఇబ్బందిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ.. ఇన్నింగ్స్ 77వ ఓవర్‌లో జోప్రా ఆర్చర్ గంటకి 148.7 కిమీ వేగంతో విసిరిన బౌన్సర్ నేరుగా వెళ్లి స్టీవ్‌స్మిత్ మెడ భాగంలో తాకింది. దీంతో.. ఈ మాజీ కెప్టెన్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత జట్టు ఫిజియో సూచన మేరకు రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగిన స్మిత్.. ఆ తర్వాత ఒక వికెట్ పడగానే మళ్లీ బ్యాటింగ్‌కి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆఖరికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకి ఆలౌటైంది. వాస్తవానికి ఫిలిప్ హ్యూస్ ఘటన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆటగాళ్ల భద్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. హెల్మట్లలోనూ మార్పులు చేసి.. మెడకి కూడా రక్షణగా నిలిచే హెల్మెట్లని తయారు చేయిస్తోంది. కానీ.. ఈ మ్యాచ్‌కి స్టీవ్‌స్మిత్ కొత్త తరహా హెల్మెట్‌ని వాడలేదు. ఈ మెడ గాయానికి కొద్దిసేపు ముందు కూడా ఆర్చర్ బౌలింగ్‌లో స్మిత్ ముంజేతికి గాయమైంది. కానీ.. మైదానంలోనే చికిత్స తీసుకున్న ఈ మాజీ కెప్టెన్ బ్యాటింగ్‌ని కొనసాగించాడు.