6 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం

SMTV Desk 2019-08-18 14:19:41  

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో 268 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసిన శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఆఖరి రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 133/0తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన శ్రీలంక జట్టు.. కెప్టెన్ కరుణరత్నె (122: 243 బంతుల్లో 6x4, 1x6) శతకం బాదడంతో 86.1 ఓవర్లలో 268/4తో గెలుపొందింది. ఛేదనలో తొలి వికెట్‌కి ఓపెనర్ తిరుమానె (64: 163 బంతుల్లో 4x4)తో కలిసి 161 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కరుణరత్నె జట్టు స్కోరు 218 వద్ద ఔటయ్యాడు. అయితే.. అప్పటికే శ్రీలంక గెలుపు ఖాయమైంది. ఇక రెండో టెస్టు మ్యాచ్ కొలంబో వేదికగా ఈనెల 22 నుంచి ప్రారంభంకానుంది. గాలెలో బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 83.2 ఓవర్లలో 249 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో రాస్ టేలర్ (86: 132 బంతుల్లో 6x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. లంక బౌలర్లలో అఖిల ధనంజయ ఐదు వికెట్లు పడగొట్టగా.. లక్మల్ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టులో డిక్వెల్లా (61: 109 బంతుల్లో 3x4), కుశాల్ మెండిస్ (53: 89 బంతుల్లో 7x4, 1x6), మాథ్యూస్ (50: 98 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీలు బాదారు. దీంతో.. ఆ జట్టు 93.2 ఓవర్లలో 267 పరుగులకి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ని 18 పరుగుల లోటుతో ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు‌లో ఈసారి వికెట్ కీపర్ వాట్లింగ్ (77: 173 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీతో మెరిశాడు. కానీ.. ఆ జట్టు టాప్ ఆర్డర్ మరోసారి తేలిపోవడంతో 106 ఓవర్లలో 285 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. 268 పరుగుల లక్ష్యం శ్రీలంక ముందు నిలవగా.. కెప్టెన్‌ కరుణరత్నె సెంచరీతో ఆ జట్టుని అలవోకగా గెలిపించేశాడు.