బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హెచ్చరిక

SMTV Desk 2019-08-17 16:35:15  

ప్రపంచ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హెచ్చరిక లాంటి వార్త ఇది. చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటన వింటే సాధారణంగా నవ్వు రావచ్చేమో కానీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నవారికి మాత్రం వణుకు రావచ్చు. ఎందుకంటే సరదాగా అతను తన గర్ల్ ఫ్రెండ్ తో ఆడిన పరాచకం అతని ప్రాణం తీసింది. రోడ్డు మీద ఐస్ క్రీం కొనిమ్మంటే కొనను అనడమే కాక లావుగా ఉన్నావని ప్రియుడు అవమానించడంతో అక్కడే అతన్ని కత్తెరతో పొడిచి చంపిందో యువతి. కలకలం రేపిన ఈ ఘటన చైనాలోని హెనెన్ ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రియుడితో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా రోడ్డు మీద ఐస్‌క్రీమ్ కనపడడంతో అది కావాలని అడిగింది. అయితే ప్రియుడు ఆమెను వారించాడు. ‘‘ఇప్పటికే చాలా లావుగా ఉన్నావు. ఐస్ క్రీం తింటే మరింత లావైపోతావు’’ అని అన్నాడు. తన ఆకృతిపై కామెంట్లు చేశాడనే కారణంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. అయితే అప్పటికి ఊరుకున్న ఆమె ఓ దుకాణంలోకి వెళ్లి కత్తెర కొనుగోలు చేసింది. ఆ కత్తెరతో ప్రియుడిని నాలుగు సార్లు పొడిచింది. ఈ ఘటన చూసి మాల్‌లో ఉన్న కస్టమర్లు పరుగులు తీశారు. కొందరు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఎమర్జన్సీ వైద్యులు వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే రక్తం పోవడంతో అతడు చనిపోయాడు. హత్య తర్వాత ఆమె అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే, పోలీసులు ఆమెను చుట్టుముట్టి అరెస్టు చేశారు. అయితే వారి ప్రేమకి బీజం పడి నెల కూడా పూర్తి కాలేదట, ఇద్దరూ ఇరవై ఏళ్ల వారే కావడం భాధాకరం. అన్నట్టు ఆమె అంత లావుగా కూడా లేదండోయ్, మరి అతను సరదాకి అన్నాడో ఏమో కానీ ఆ సరదా అతని ప్రాణాలను బలికొన్నది.