టీ20 వరల్డ్ సిరీస్‌లో భారత్ ఘనవిజయం

SMTV Desk 2019-08-14 18:09:47  

భారత వికలాంగుల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌కి ఫైనల్లో షాకిచ్చి 36 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ని సెమీస్‌లో చిత్తుగా ఓడించి ఫైనల్‌కి చేరిన భారత్ జట్టు.. తుది పోరులోనూ అదే జోరుని కొనసాగించింది. ఫైనల్లో రవీంద్ర (53: 34 బంతుల్లో 2x6, 6x6) మెరుపు అర్ధశతకం బాదడంతో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుని ఆఖరికి 144/8కే పరిమితమైంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్, ఇంగ్లాండ్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, అఫ్గానిస్థాన్ టీమ్స్‌ పోటీపడ్డాయి. అయితే.. లీగ్ దశలో నిలకడగా రాణించిన భారత్ జట్టు.. పట్టికలో నెం.1 స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెమీస్‌లో పాకిస్థాన్‌ని ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించగా.. ఇంగ్లాండ్‌ జట్టు అఫ్గానిస్థాన్‌ని ఓడించి తుది పోరుకి అర్హత సాధించింది. దీంతో.. ఇంగ్లాండ్‌ కంటే భారత్ జట్టే ఫైనల్‌కి ముందు ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో కనిపించింది.