బెంగళూరు బుల్స్‌కి షాక్ ఇచ్చిన హర్యానా

SMTV Desk 2019-08-12 12:17:52  

సీజన్ 7లో అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతున్న బెంగళూరు బుల్స్‌కి హర్యానా స్టీలర్స్‌ షాక్ ఇచ్చింది. ఆదివారం రాత్రి బెంగళూరు బుల్స్‌-హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఆఖర్లో తడబడిన బెంగళూరు టీమ్ 30-33 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. పాయింట్ల పట్టికలో బెంగళూరు ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతుండగా.. హర్యానా 9వ స్థానంలో ఉండటం విశేషం. మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ రైడర్ వికాస్ కండోలా అత్యుత్తమ ప్రదర్శనతో మెరిశాడు. గేమ్‌లో 21 సార్లు రైడ్‌కి వెళ్లిన వికాస్.. 11 పాయింట్లని జట్టుకి అందించాడు. డిఫెండర్ వికాస్ కాలే నుంచి అతనికి చక్కటి సహకారం లభించింది. మొత్తం 9 సార్లు ట్యాకిల్‌కి ప్రయత్నించిన వికాస్ కాలే.. ఆరు పాయింట్లతో సత్తాచాటాడు. మరోవైపు బెంగళూరు జట్టులోనూ స్టార్ రైడర్ రోహిత్ కుమార్ జట్టుని గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. మ్యాచ్‌లో 17 సార్లు రైడ్‌కి వెళ్లిన మోహిత్ 10 పాయింట్లను సాధించడమే కాకుండా.. రెండు ట్యాకిల్స్‌ పాయింట్లను కూడా టీమ్‌కి అందించాడు. అయినప్పటికీ.. ఆఖర్లో డిఫెండర్ల తప్పిదాల కారణంగా ఆ జట్టుకి ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్‌లో గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌‌పై తెలుగు టైటాన్స్ 30-24 తేడాతో గెలిచింది. టోర్నీలో తెలుగు టైటాన్స్ గెలవడం ఇదే తొలిసారి.