బోణీ కొట్టిన టైటాన్స్...జోరు కొనసాగించేనా!

SMTV Desk 2019-08-12 12:15:55  

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ 7లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం రాత్రి గుజరాత్‌ పార్చూన్ జైయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-24 తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఏడో మ్యాచ్‌తో బోణి కొట్టిన తెలుగు టైటాన్స్ ఈరోజు బెంగాల్ వారియర్స్‌తో ఢీకొట్టబోతోంది. రాహుల్ చౌదరి తమిళ తలైవాస్‌కి వెళ్లిపోవడంతో ఢీలాపడినట్లు కనిపించిన తెలుగు టైటాన్స్‌‌లో మళ్లీ ఉత్సాహం నింపేందుకు రైడర్ సిద్ధార్ధ దేశాయ్ టోర్నీ ఆరంభం నుంచీ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. కానీ.. జట్టు మాత్రం సమష్టిగా రాణించలేకపోతోంది. తాజాగా గుజరాత్‌పై మ్యాచ్‌లో మరోసారి సిద్ధార్థ్ 7 పాయింట్లతో జట్టుని ముందుండి నడిపించాడు. అతనికి తోడుగా ఈసారి విశాల్ భరద్వాజ్ కూడా రాణించడంతో తెలుగు టైటాన్స్‌ మళ్లీ పుంజుకుంది. సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన బెంగాల్ వారియర్స్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో.. ఈరోజు మ్యాచ్‌లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్‌కి గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే గెలుపు రుచి చూసిన తెలుగు టైటాన్స్ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.