తప్పనిసరి పరిస్థితుల్లో రెండోసారి శస్త్రచికిత్స!

SMTV Desk 2019-08-11 15:29:18  

భారత జట్టు సీనియర్ ఆటగాడు సురేశ్‌ రైనా మోకాలికి తాజాగా సర్జరీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా రైనా తన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ లేఖను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం తాను నిలకడగా కోలుకుంటున్నానని తెలిపాడు. ఇలాంటి స్థితిలో తాను త్వరగా కోలుకోవాలని అండగా నిలిచిన వైద్యులు, సన్నిహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. 2007లో నాకు తొలిసారి మోకాలి చికిత్స జరిగింది. తర్వాత కోలుకొని ఆటను కొనసాగించాను. అప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన ట్రైనర్లు, వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాగా కొద్ది సంవత్సరాలుగా మళ్లీ మోకాలి నొప్పి ప్రారంభమైంది. ఆ సమయంలోనూ నేను ఫిట్‌గా ఉండేందుకు మా సిబ్బంది ఎంతో ప్రయత్నించారు. వారి సహాయసహకారాల వల్లే మైదానంలో చురుగ్గా ఆడగలిగాను. అయితే ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండోసారి శస్త్రచికిత్స తీసుకున్నా. ఈ నిర్ణయం తీసుకోడానికి కష్టతరమనిపించింది. ఎందుకంటే.. మైదానంలో అడుగుపెట్టడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది. అది నాకు ఇష్టంలేదు. అయినా చికిత్స తీసుకునేందుకు సిద్ధపడ్డా. ఇక త్వరలోనే పూర్తిగా కోలుకొని మీ ముందుకు వస్తా అని పేర్కొన్నాడు.