మహ్మద్‌ షెహజాద్‌పై సస్పెండ్ వేటు

SMTV Desk 2019-08-11 15:28:25  

అఫ్గానిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ షెహజాద్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు సస్పెండ్ వేటు వేసింది. షెహజాద్‌ పదే పదే బోర్డు నియమాలను ఉల్లఘిస్తున్నాడని అభియోగాలు మోపిన అఫ్గానిస్తాన్‌ బోర్డు తాజాగా నిరవధికంగా సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత షెహజాద్‌ ఫిట్‌గా లేడంటూ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాను ఫిట్‌గానే ఉన్నప్పటికీ బోర్డు కావాలనే తనపై వేటు వేసిందని షెహజాద్‌ పేర్కొన్నాడు. తన క్రికెట్‌ కెరీర్‌ను నాశనం చేసేందుకు తమ క్రికెట్‌ బోర్డులోని కొందరు పెద్దలు కుట్ర పన్నారని విమర్శించాడు.తాజాగా షెహజాద్‌ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బోర్డు క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించిన కారణంగానే అతనిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఏసీబీ తెలిపింది. గత నెలలో క్రమశిక్షణా నియమావళి సమావేశాలు జరగ్గా అందుకు షెహజాద్‌ గైర్హాజరీ అయ్యాడని బోర్డు పేర్కొంది. మరొకవైపు బోర్డు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలా పదే పదే బోర్డు నియమాలను పెడ చెవిన పెడుతున్న షెహజాద్‌పై సస్పెన్షనే సరైనదని భావించి ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఏసీబీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.