వైరల్ అవుతున్న అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ స్పీచ్

SMTV Desk 2019-08-08 14:32:23  

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన అంశంపై లోక్ సభలో ప్రసంగించిన సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్... ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాపై ప్రశంసలు కురిపించారు. ఎన్నో దశాబ్దాలుగా సరిహద్దుల్లో బలిదానాలు చేసిన సైనికులకు ఇది నిజమైన నివాళి ఆమె వ్యాఖ్యానించారు. ఎప్పుడెప్పుడు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతానా అని తాను ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సనం, గణతంత్ర్య దినోత్సవం అంతటి గొప్ప రోజు ఆగస్టు 5 అని అన్నారు. గతంలో కాశ్మీర్‌కు వెళితే అక్కడి ప్రజలు మీరు భారత్ నుంచి వచ్చారా అని ప్రశ్నించేవారన్న నవనీత్ కౌర్... ఒకవేళ కాశ్మీర్ ప్రజలు భారత్‌లో కలిసి ఉంటే అక్కడి ప్రజలు ఈ ప్రశ్నే అడిగేవారు కాదని వ్యాఖ్యానించారు.

అందరూ కాశ్మీర్‌లోని సుందర ప్రదేశాల గురించి మాత్రమే మాట్లాడతారని... కానీ అక్కడ పేదరికం ఎంతో భయంకరంగా ఉంటుందని ఆమె అన్నారు. కాశ్మీర్‌పై ఈ రకమైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతి అంటే ఏమిటో అందరికీ తెలిసొచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా అందరి మనసులో నిలిచిపోతుందని అన్నారు. ఈ క్రమంలోనే తన ప్రసంగానికి అడ్డుతగలబోయిన ఓ తెలుగు ఎంపీకి తెలుగులోనే నవనీత్ కౌర్ సమాధానం చెప్పడం విశేషం. తనకు తెలుగు తెలుసు అని... తాను మాట్లాడుతున్నట్టు అడ్డురావొద్దని నవనీత్ కౌర్ వారిని సూచించారు. రెండు నిమిషాలు తనకు సమయం ఇవ్వాలని కోరారు.