పోలీసులకు ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ చేశాడు!

SMTV Desk 2019-08-08 14:30:25  

ఓ బాలుడు పిజ్జా ఆర్డర్ చేస్తే పోలీసులు వచ్చి డెలివరీ చేసి వెళ్లారు. అదేంటి పోలీసులేమన్నా డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారా అని అనుకుంటున్నారా... లేదండి ఆ బాలుడు ఫోన్ పోలీసులకే ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ చేశారు. ఈ ఘటన పూర్తి వివరాల ప్రకారం... ఒర్లాండో సబార్బన్‌లో నివసిస్తున్న ఐదేళ్ల బాలుడికి ఆకలేసింది. దీంతో పోలీసుల హెల్ప్‌లైన్ నెంబరు 911కు డయల్ చేసి పిజ్జా కావాలని ఆర్డర్ చేశాడు. వాస్తవానికి 911 నెంబరు ఎమర్జన్సీ కోసమే ఉపయోగిస్తారు. ఇండియాలో ‘100’ నెంబరు డయల్ తరహాలో అమెరికాలో 911 నెంబరు పనిచేస్తుంది. దానికి కాల్ వెల్లగానే పోలీసులు అప్రమత్తమై.. ఆ ప్రాంతాన్ని ట్రేస్ చేసి దగ్గరలో ఉండే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇస్తారు. క్షణాల్లో అక్కడికి చేరి సమస్య పరిష్కరిస్తారు. ఎవరైనా ఆకతాయిగా ఫోన్ చేస్తే తాట తీస్తారు. పిజ్జా కోసం ఫోన్ చేసింది ఐదేళ్ల బాలుడు కావడంతో పోలీసులు సరదాగా తీసుకున్నారు. ఆకలితో ఉన్న ఆ బాలుడిని నొప్పించడం ఇష్టం లేక ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు పిజ్జా కొనుగోలు చేసి ఆ బాలుడికి డెలివరీ చేశారు. దీంతో ఆ బాలుడు చాలా సంతోషించాడు. ఈ సందర్భంగా పోలీసులు ఆ బాలుడికి చిన్న క్లాస్ తీసుకున్నారు. 911 నెంబరును ఆహారం కోసం, ఆటల కోసం చేయకూడదని వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. శాన్‌ఫోర్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించింది. పోలీసులు చేసిన పనికి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.