నేడు వన్డే సిరీస్ ప్రారంభం... విండీస్ జట్టులోకి గేల్

SMTV Desk 2019-08-08 14:23:52  

విండీస్ పర్యటనలో ప్రారంభ సిరీస్ ను సొంతం చేసుకున్న ఇండియా నేడు ప్రారంభం కానున్న వన్డే సిరీస్ పై కూడా కన్నేసింది. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతూ టీ20 సిరీస్‌కి దూరమైన విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్.. వన్డేల కోసం మళ్లీ తమ జట్టులోకి వచ్చాడు. ఇప్పటి వరకూ వెలువడిన రిటైర్మెంట్ వార్తల ప్రకారం.. క్రిస్‌గేల్‌కి కెరీర్‌లో ఇదే చివరి వన్డే సిరీస్ కానుంది. ఇక భారత్ జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉండగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం నిరాశపరుస్తున్నాడు. టీ20 సిరీస్‌లో వరుసగా 1, 23, 3 పరుగులతో తేలిపోయి ధావన్.. కనీసం ఈ వన్డే సిరీస్‌లోనైనా సత్తాచాటకపోతే టీమ్‌లో ఇక చోటు వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. ప్త్యామ్నాయ ఓపెనర్ రూపంలో కేఎల్ రాహుల్ జట్టులోనే అందుబాటులో ఉన్నాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆఖరి టీ20లో ఫామ్‌ అందుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నా.. మూడంకెల స్కోరుని మాత్రం చేరుకోలేకపోతున్నాడు. దీంతో.. వన్డే సిరీస్‌లో‌నైనా కోహ్లీ శతకం చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మిడిలార్డర్‌లో మనీశ్ పాండే‌ లేదా శ్రేయాస్ అయ్యర్‌లో ఒకరికి అవకాశం దక్కనుండగా బౌలింగ్‌లో ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ షైనీ, భువనేశ్వర్‌‌కి తోడుగా షమీ జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మణికట్టు స్పిన్నర్ చాహల్ లేదా కుల్దీప్‌లో ఒకరికి అవకాశం దక్కనుంది.