రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

SMTV Desk 2019-08-07 17:30:13  

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అన్ని కాల పరిమితులకు సంబంధించిన రుణాలపై 15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.25 శాతంగా ఉంది. ఏడాది కాలపు రుణాలకు ఎంసీఎల్ఆర్ 8.25 శాతంగా ఉంటుంది. ఇది వరకు ఈ రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.4 శాతంగా ఉండేది. ఆగస్ట్ 10 నుంచి తగ్గిన ఎంసీఎల్ఆర్ రేటు అమలులోకి వస్తాయి. ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. ఈవిధంగా ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో ఎస్‌బీఐ హోమ లోన్స్‌పై వడ్డీ రేటు ఏప్రిల్ 10 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీలక పాలసీ రేట్లు 35 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ కూడా వెంటనే ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇకపోతే ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడం ఇది వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. తాజా తగ్గింపుతో రెపో రేటు 5.4 శాతానికి దిగొచ్చింది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు, వినియోగాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకుంది. రెపో రేటు తగ్గింపుతో రివర్స్ రిపో రేటు కూడా 5.15 శాతానికి దిగొచ్చింది. అదేసమయంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు 5.65 శాతానికి వచ్చి చేరాయి. ఇటీవల కాలంలో పలు అంశాలు (వాహన అమ్మకాలు) ఆర్థికవృద్ధి మందగమాన్ని సూచించాయి. అలాగే అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ పైస్థాయికి చేరుకున్నాయి.