పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చినవాళ్లు దేశానికి ప్రధానులయ్యారు

SMTV Desk 2019-08-06 11:47:13  

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్‌విభజన బిల్లుపై ఓటింగ్ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావించారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఆర్టికల్ 370 రద్దు చేస్తే కలిగే ప్రయోజనాలను రాజ్యసభలో వెల్లడించిన అమిత్‌షా.. పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చినవాళ్లు దేశానికి ప్రధానులయ్యారు.. మన్మోహన్ సింగ్, ఐకే గుజ్రాల్‌లు పాక్ నుంచి వచ్చి భారత ప్రధానులయ్యారన్నారని గుర్తుచేశారు. ఇక, కశ్మీర్‌లోని పంచాయతీలకు రేపటి నుంచి నిధులిస్తామని ప్రకటించిన అమిత్‌షా.. అక్కడి పంచాయతీలు, మున్సిపాలిటీలకు స్పష్టమైన అధికారాలు దక్కుతాయన్నారు. స్థానిక సంస్థల సంస్కరణలు అమల్లోకి వచ్చాక 40 వేల పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. వేల కోట్ల అభివృద్ధి నిధులు సర్పంచ్‌లకు వెళ్తాయని వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోనే జమ్మూకశ్మీర్‌కు రూ.2.76 లక్షల ప్యాకేజీ ఇచ్చామని గుర్తుచేశారు కేంద్రహోంమంత్రి... మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతీపౌరుడిపై రూ.8వేలు ఖర్చు చేస్తే.. జమ్మూకశ్మీర్‌లో ఒక్కో పౌరుడిపై రూ.27 వేలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. 370 ఆర్టికల్ రద్దుతో కశ్మీర్‌లో అవినీతి పాలన అంతమైపోతుందన్నారు. మేం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదల్చుకోలేదని స్పష్టం చేసిన ఆయన.. ఆర్టికల్ 370 వల్లే కశ్మీర్ విలీనం జరిగిందన్న వాదన సరికాదన్నారు.కశ్మీర్‌ యువతకు మంచి భవిష్యత్ కల్పించాలనుకుంటున్నాం.. కశ్మీర్‌లో ఆదివాసీలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు అమిత్‌షా. కాగా, ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 370 ఆర్టికల్ రద్దు బిల్లు మూజువాణి ఓటుతో నెగ్గింది. అయితే, జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు డివిజన్‌ కోరారు. ఈ బిల్లుపై ఓటింగ్ జరగగా.. అనుకూలంగా 125 ఓట్లు వస్తే.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ 61 ఓట్లు పడ్డాయి.. ఒకరు తటస్థంగా ఉన్నారు.