నవదీప్ శైని...ఇంటర్నేషనల్ కెరీర్ ఆదిలోనే పరాభవం

SMTV Desk 2019-08-05 16:32:25  

విండీస్ పర్యటనలో భాగంగా మొదటి టీ20లో భారత జట్టు నుండి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన యువ క్రికెటర్ నవదీప్ శైనికి ఆదిలోనే పరాభవం ఎదురయ్యింది. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20లో నికోలస్‌ పూరన్‌ ఔటైనప్పుడు అతడు కాస్త అతిగా సంబరాలు చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ వేశారు. ఈ పోరులో అతడు మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కుదేలు చేశాడు. అంతేకాక శైనికి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కూడా లభించింది. ఐసీసీ ఆటగాళ్ల నిబంధన 2.5ను సైని ఉల్లంఘించినట్టు గుర్తించాం. బ్యాట్స్‌మన్‌ ఔటైనప్పుడు అతడు దూకుడుగా సంజ్ఞలు చేస్తూ అతిగా సంబరాలు చేసుకున్నాడు. అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ జమ చేశాం అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫీల్డ్‌ అంపైర్లు నిగెల్‌ డుగిడ్‌, జార్జ్‌ బ్రాత్‌వైట్‌, మూడో అంపైర్‌ లెస్లీ రీఫర్‌, నాలుగో అంపైర్‌ ప్యాట్రిక్‌ గస్టర్డ్‌ పేసర్‌ సైనిపై అభియోగాలు నమోదు చేశారు. రిఫరీ జెఫ్‌ క్రో ముందు పొరపాటు అంగీకరించడంతో అతడికి డీమెరిట్‌ పాయింట్‌ విధించారు.