అక్క సమయస్ఫూర్తి...తమ్మున్ని పెను ప్రమాదం నుండి రక్షించి!

SMTV Desk 2019-08-05 16:31:29  

లిఫ్ట్ లో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఎప్పుడూ చిన్న పిల్లల్ని ఒంటరిగా లిఫ్ట్ లోకి పంపించే ప్రయత్నం చేయకూడదు. అయితే ఇటువంటి సంఘటనే తాజాగా చోటుచేసుకుంది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఐదేళ్ల బాలుడు తన అక్క, చెల్లితో కలిసి అపార్టుమెంటులో లిఫ్ట్ వద్దకు వచ్చారు. బాలుడు బొమ్మ లాగే తాడును మెడలో వేసుకుని లిఫ్ట్ ఎక్కాడు. అయితే, తలుపులు వెంటనే మూసుకోవడంతో బొమ్మ లిఫ్ట్ బయట ఉండిపోయింది. లిఫ్ట్ కిందకి వెళ్లగానే తాడు మొత్తం పైకెళ్లి.. బాలుడికి ఉరిలా బిగుసుకుంది. ప్రమాదాన్ని గుర్తించిన బాలుడి అక్క వెంటనే లిఫ్ట్‌లో స్టాప్ బటన్ నొక్కి.. ఎమర్జన్సీ అలారం మోగించింది. మరోవైపు తమ్మడి మెడకు తాడు బిగుసుకోకుండా పట్టుకుంది. లిఫ్ట్ ఆగిన వెంటనే ఆ తాడును అతడి మెడ నుంచి తీసేసింది. దీంతో ఆ బాలుడుకు ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి సమయస్ఫూర్తికి నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.