మరోవారంలో కరీంనగర్‌కు కాళేశ్వరం జలాలు

SMTV Desk 2019-08-05 16:28:12  

కరీంనగర్‌ తెరాస ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం మీడియా మాట్లాడుతూ, “ఎగువన మహారాష్ట్రలో 11 బ్యారేజీలు నిర్మించడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్‌ఎస్పీ) లోకి నీళ్ళురాక పూర్తిగా అడుగంటింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిన సిఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎస్ఆర్‌ఎస్పీ పునరుజ్జీవన పధకాన్ని ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మరొక వారం పది రోజులలోగా గోదావరి జలాలు నాగులమల్యాలకు చేరుకుంటాయి. దాంతో ఇక కరీంనగర్‌ ప్రజలకు త్రాగు,సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రస్తుతం మేడిగడ్డ నుంచి విడుదలవుతున్న నీళ్ళు కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ళ దాటి యెల్లంపల్లికి చేరుకొంటున్నాయి. అక్కడి నుంచి మిడ్‌మానేరు, లోవర్ మానేరుకు నీరు తరలివస్తుంది. కనుక గోదావరి జలాలు కరీంనగర్‌ చేరుకునేరోజున నాగులమల్యాలలో నిర్వహించబోయే జలజాతరలో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.