జమ్ముకశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయాలు

SMTV Desk 2019-08-05 16:25:25  

ఊహించినట్లుగానే కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్ కలిపి శాసనసభ కలిగిన ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లడాక్‌ను శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా విభజించింది. కేంద్రహోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం రాజ్యసభ దీనికి సంబందించిన బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను, జమ్ముకశ్మీర్‌ పౌరసత్వ బిల్లు 35 (ఏ)లను రద్దు చేసేందుకు బిల్లులను ప్రవేశపెట్టారు. సభలో వీటిపై చర్చ జరుగుతుండగానే ఆర్టికల్ 370ను, జమ్ముకశ్మీర్‌ పౌరసత్వ బిల్లు 35 (ఏ)లను రద్దు చేస్తూ రాష్ట్రపతిభవన్‌ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీంతో జమ్మూ కశ్మీర్‌కున్న ప్రత్యేకాధికారాలు, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక పౌరసత్వం అన్నీ రద్దయ్యాయి. ఇప్పుడు దేశంలో మిగిలిన రాష్ట్రాలకు వర్తించే అన్ని చట్టాలు, నియమనిబందనలు జమ్ము కశ్మీర్‌, లడాక్‌లకు కూడా వర్తిస్తాయి. ముఖ్యంగా..ఇంతకాలం భారత్ పార్లమెంటుకు అతీతమన్నట్లుగా ఉండే జమ్ము కశ్మీర్‌ ఇకపై పార్లమెంటుకు లోబడి ఉండవలసివస్తుంది.

ఈ మూడు బిల్లులతోపాటు జమ్ము కశ్మీర్‌ మరియు లడాక్ ప్రాంతాలలో ఆర్ధికంగా వెనుకబడినవర్గాల వారికి ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం కలిగిన వారికి ఇది వర్తిస్తుంది.

ఈ బిల్లులపై అమిత్ షా ప్రకటన చేయగానే ఊహించినట్లే కాంగ్రెస్‌, పిడిపి, వామపక్షాలు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. ఈ బిల్లులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశాయి. వీటిపై పునరాలోచన చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరబోతున్నాయి. అయితే ఈ ప్రతిపాదనలకు ఆయన ముందే ఆమోదముద్ర వేసి నోటిఫికేషన్‌ జారీ చేశారు కనుక వారి ప్రయత్నాలు ఫలించవని చెప్పవచ్చు. తెరాస, వైసీపీ, అన్నాడీఎంకె, డిఎంకె, అకాలీదళ్ ,శివసేన, జెడిఎస్ తదితర పార్టీలు ఏ బిల్లుకు పూర్తి మద్దతు తెలిపాయి. కేంద్రప్రభుత్వానికి లోక్‌సభలో తగినంత బలం ఉంది కనుక వాటిని చాలా సులువుగా లోక్‌సభలో ఆమోదింపజేసుకోగలదు కనుక ఈ బిల్లులను రాజ్యసభలో ఆమోదింపజేసుకోగలిగితే శాశ్వితంగా చట్టరూపం దాల్చుతుంది.