కశ్మీర్ ప్రజలకు హెచ్చరికలు.... శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు పోటెత్తిన ప్రయాణికులు!!

SMTV Desk 2019-08-03 14:37:37  

జమ్మూకశ్మీర్ లో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు వెంటనే స్వస్థలాలకు వెళ్లిపోవాలని అక్కడి పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు అమర్ నాథ్ యాత్రికులతో పాటు ఇతరుల్ని లక్ష్యంగా చేసుకోవచ్చన్న నిఘావర్గాల హెచ్చరికతోనే ఈ ఆదేశాలు జారీచేసినట్లు పాలనా యంత్రాంగం స్పష్టం చేసింది. దీంతో శ్రీనగర్ నిట్ కాలేజీతో పాటు వందలాది సంఖ్యలో పర్యాటకులంతా స్వస్థలాలకు వెళ్లేందుకు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయం రద్దీగా మారిపోయింది. అయితే అదే సంఖ్యలో విమానాలను ఎయిర్ లైన్స్ కంపెనీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలంతా పడిగాపులు కాస్తున్నారు. వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు.

ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలోనే కశ్మీర్ లో 35,000 మందికి పైగా బలగాలను మోహరించినట్లు కేంద్రం చెబుతున్నా, ఆర్టికల్ 35Aను ఎత్తివేసేందుకే కేంద్రం కుట్ర పన్నుతోందని కశ్మీర్ కు చెందిన రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అనిశ్చితి నెలకొనే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో కశ్మీర్ ప్రజలు ఏటీఎంలు, పెట్రోల్ బంకులు, నిత్యావసర వస్తువుల షాపుల ముందు క్యూ కట్టారు. కొన్ని నెలల పాటు కావాల్సిన సరుకులను ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు.