దెబ్బకు దెబ్బ : చలానా వేసినందుకు పోలీస్ స్టేషన్‌కు కరెంట్ కట్ చేసిన లైన్‌మేన్

SMTV Desk 2019-08-01 15:21:01  

కరెంటు లైన్ మేన్ హెల్మెట్ పెట్టుకోలేదని ఎస్‌ఐ రూ.500 జరిమానా విధించాడు. దీంతో చిర్రెత్తిపోయిన లైన్‌మేన్ పోలీస్ స్టేషన్ కరెంట్ బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేసాడు. ఈ సంఘటన ఆగ్రాలోని లీనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..శ్రీనివాస్ అనే లైన్ మెన్ హెల్మెట్ పెట్టుకోలేదని లీనాపూర్ ఎస్‌ఐ రమేశ్ చంద్ర రూ.500 చలానా రాశాడు.

తరువాత హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ గురించి శ్రీనివాస్‌కు చెప్పి అక్కడి నుంచి పంపించాడు. దీంతో కోపాద్రిక్తుడైన శ్రీనివాస్ సబ్ స్టేషన్‌కు వెళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లే కరెంట్ తీగను కట్ చేశాడు. పోలీసులు సబ్ స్టేషన్‌కు ఫోన్ చేయగా పోలీస్ స్టేషన్‌పై రూ.6.6 లక్షల కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉందని అందుకే కట్ చేశామని వివరణ ఇచ్చాడు. బిల్లు చెల్లిస్తేనే కరెంట్ సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో చేసేది ఏమి లేక బిల్లు చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.