విండీస్ పర్యటనకు బయలుదేరిన భారత జట్టు

SMTV Desk 2019-07-31 14:19:40  india, west indies,

ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఓటమి తర్వాత భారత జట్టును వివాదాలు చుట్టుముట్టాయి. సెమీస్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తీసుకున్న నిర్ణయాలతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ విభేదించాడని, ఇది ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణమైందన్న వార్తలు నిన్నమొన్నటి వరకు హల్‌చల్ చేశాయి. మరోవైపు కోహ్లీ భార్య అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను రోహిత్ అన్‌ఫాలో చేయడం, ప్రతిగా రోహిత్, అతడి భార్య రితికల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను అనుష్క అన్‌ఫాలో చేయడంతో రోహిత్-కోహ్లీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయన్న వార్తలు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి.

బీసీసీఐ పెద్దలు ఈ విషయంలో వివరణ ఇచ్చినప్పటికీ అటు కోహ్లీ కానీ, ఇటు రోహిత్ కానీ నోరు విప్పకపోవడంతో నిజంగానే వారిమధ్య ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడ్డాయి. విండీస్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల క్రితం కోహ్లీ మీడియా ముందుకు వచ్చి తనకు రోహిత్‌కు మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టేపడేశాడు. వార్తలను గుడ్డిగా నమ్మేయడం కాదని, వాస్తవాలను కూడా అంగీకరించాలని కాసింత గట్టిగానే చెప్పాడు. మన బుర్రలను అవాస్తవాలతో నింపేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. కోహ్లీ వివరణతో అప్పటి వరకు వస్తున్న పుకార్లకు తెరపడింది.

ఈ వార్తల వేడి ఇలా ఉండగానే కోహ్లీ సేన సోమవారం రాత్రి విండీస్ పర్యటనకు బయలుదేరింది. ఆగస్టు మూడో తేదీ నుంచి పర్యటన ప్రారంభం కానుంది. ఆతిథ్య విండీస్‌తో తొలుత మూడు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. 22 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ టూర్‌లో తొలి రెండు టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్నాయి.