తెలంగాణలో ఆసరా పెరిగింది

SMTV Desk 2019-07-30 14:42:34  Asara pension

తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛనులు అందుకొంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వృద్ధాప్య పింఛను వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్ళకు తగ్గించడంతో కొత్తగా 8 లక్షల మందికి ఆసరా లభించింది. దాంతో ఇప్పటివరకు 12.92 లక్షలుగా ఉన్న వారి సంఖ్య 20 లక్షలకు చేరింది. వారితోపాటు కొత్తగా బోధకాలు వ్యాధిగ్రస్తులు, అంగవైకల్యం ఉన్నవారు, ఒంటరి మహిళలు తదితరులు అనేకమంది తమ పేర్లను నమోదు చేసుకోవడంతో ఆసరా పింఛను లబ్దిదారుల సంఖ్య 38.99 లక్షల నుంచి 47 లక్షలకు చేరుకొంది. కనుక వారి పింఛన్ల చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా మంజూరు చేస్తున్న నిధులు కూడా భారీగా పెంచక తప్పడం లేదు. ఇప్పటి వరకు ఆసరా పింఛన్ల చెల్లింపులకు ఏడాదికి రూ.5,000 కోట్లు కేటాయిస్తుండగా ఇకపై ఏడాదికి రూ. 12,000 కోట్లు వరకు కేటాయించవలసి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో నిరుపేద, నిస్సహాయ ప్రజలకు ఆర్దిక సాయం చేయడం చాలా అవసరమే కానీ దానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడం ప్రభుత్వానికి చాలా కష్టమే. ఆసరా పింఛను చెల్లింపులే కాకుండా రైతు బందు, రైతు భరోసా, విద్యార్దుల ఫీజు రీఇంబర్స్ మెంట్, వివిద సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, కాలేజీల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పధకం అమలు, రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేకానేక పధకాలకు, కార్యక్రమాలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే భావించవలసి ఉంటుంది.