కిలో టీపొడి ధర రూ.50,000

SMTV Desk 2019-07-30 14:40:13  

గువాహటి: దేశంలోనే మొట్టమొదటిసారి కిలో టీపొడి ధర రూ.50,000 పలికింది. గువాహటి టీపొడి వేలం కేంద్రంలో మంగళవారం ఉదయం జరిగిన వేలం పాటలో అస్సాంలోని తేయాకు తోటల్లో అత్యంత అరుదుగా పండించే మనోహరి గోల్డ్ టీ గతంలో ఎన్నడూ లేనంత ధర పలికింది. గత ఏడాది ఇదే రకం టీపొడి కిలో రూ. 39,001 ధర పలకగా అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలీ టీ ఎస్టేట్‌లో పండించే గోల్డెన్ నీడిల్ రకం టీ పొడి కిలో రూ. 40,000 ధర పలికింది.

అయితే మనోహరి గోల్డ్ టీ పొడికి ఈ ఏడాది అత్యధిక ధర పలకడం విశేషమని గువాహటి టీ ఆక్షన్ బయ్యర్స్ అసోసియేషన్ కార్యదర్శి దినేశ్ బిహానీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది కేవలం ఐదు కిలోలు మాత్రమే మనోహరి గోల్డ్ టీ పండించగలిగామని దిబ్రూగఢ్‌లోని మనోహరి టీ ఎస్టేట్ యజమాని రాజన్ లోహియా తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేనందు వల్ల ఎక్కువ పంట రాలేదని ఆయన అన్నారు. తేయాకు కాకుండా మొగ్గలతో తయారయ్యే మనోహరి గోల్డ్ టీపొడి మే, జూన్ నెలలో లభిస్తుంది.