తెలంగాణ 2015 గ్రూప్-2కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2019-07-23 10:57:45  group 2

తెలంగాణ గ్రూప్-2(2015) నియమాకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేయవచ్చునని స్పష్టం చేసింది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా 2015లో 1,032 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి 2016లో రాత పరీక్షలు నిర్వహించింది. దానిలో ఇన్విజిలేటర్లు చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా న్యాయవివాదాలు మొదలవడంతో అప్పటి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. దానిపై సుదీర్ఘ విచారణ చేసిన హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు సూచించి దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగించవచ్చని తీర్పు చెప్పింది.

హైకోర్టు తీర్పుపై మహబూబ్‌నగర్‌కు చెందిన 35 మంది అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, వారి వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయని, వాటి కారణంగా ఏళ్ళ తరబడి ఉద్యోగాల భర్తీని నిలిపివేయడం సరికాదని న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందిర బెనర్జీతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్ధిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో నాలుగేళ్ళుగా ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రూప్-2 అభ్యర్ధులకు చాలా ఉపశమనం కలిగింది.