యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు!

SMTV Desk 2019-07-18 15:38:00  Angry Elephant Attacks American Tourists

యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి రావడం అంటే ఇదేనేమో. దక్షిణాఫ్రికాలోని జంగిల్ సఫారీలో ఓ ఏనుగు టూరిస్టులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. వారంతా చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తిరిగి వచ్చారు. డ్రైవర్ చాకచక్యంగా జీపు నడపడంతో బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. దక్షిణాఫ్రికాలోని జంగిల్ సఫారీలో జీపులో వన్య మృగాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులకు ఎదురైన చేదు అనుభవం ఇది. అడవిలో పర్యటిస్తుండగా ఉగ్రరూపంలో ఉన్న ఏనుగు వారి జీపుకు ఎదురైంది. అది మరింత ఆగ్రహంతో జీపు మీదకు వచ్చింది. దీంతో డ్రైవర్ జీపును వేగంగా వెనక్కి నడిపాడు. ఏనుగు కూడా అంతే వేగంతో ముందుకు పరిగెడుతూ జీపును తొండంతో కొట్టేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో జీపులో ఉన్న పర్యాటకులు కంగారుపడ్డారు. అరుపులు.. కేకలు పెడితే ఏనుగు మరింత ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలియడంతో నిశబ్దంగా కూర్చున్నారు. జీపుపైకి దూసుకొస్తున్న ఏనుగు ఉగ్రరూపాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. అంతా ఆ డ్రైవర్ డ్రైవింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ సినిమా స్టైల్‌లో జీపును వెనక్కి నడపాడంటూ తెగ పొగిడేస్తున్నాడు. అయితే, ఈ వీడియో సగం మాత్రమే ఉండటంతో ఆ తర్వాత వాళ్లు దాని నుంచి ఎలా తప్పించుకున్నారనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.